ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో నేతల వలసలు ఊపందుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు సైకిల్ ఎక్కేందుకు సిద్దమయ్యారనే వార్తలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హీట్ పెంచేస్తున్నాయి. అంతేకాక చంద్రబాబు చేయించిన ఒక సర్వే ఇప్పుడు సిట్టింగ్ లలో గుబులు రేపుతోంది. ఆ సర్వే ఫలితాలను బట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలయినా సరే వచ్చే ఎన్నికల్లో వారు గెలవరని సర్వేలో తేలితే టిక్కెట్లు ఇవ్వమని నిర్దాక్షన్యంగా చెబుతున్నారు. దానికి ఊతం ఇచ్చేలా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి బుధవారం భేటీ అయ్యారు.
టీడీపీలో చేరే అంశంపై ఈ సందర్భంగా ఇరువురి మధ్య మంతనాలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ మాజీ మంత్రి కొండ్రు మురళి కూడా ఇప్పటికే టీడీపీ నేత కళా వెంకట్రావుతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన సొంత నియోజకవర్గమైన రాజాం టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే కొండ్రు మురళి రాకను పార్టీ సీనియర్ మహిళా నేత ప్రతిభా భారతి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం ఆ సర్వే ఫలితాలను బట్టి వేర్వేరు వ్యక్తుల పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.