Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమల పర్యటనలో అలిపిరి వద్ద ఆయన కాన్వాయ్ పై రాళ్లదాడి జరగలేదని ఏపీ డీజీపీ మాలకొండయ్య స్పష్టంచేశారు. అమిత్ షా కాన్వాయ్ పై ఎలాంటి రాళ్లదాడి జరగలేదని, కాన్వాయ్ లోని ఏడో కారు అలిపిరి వద్ద కొద్దిగా స్లోగా వెళ్లిందని… ఈ లోగా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కర్రతో కారు అద్దం పగులగొట్టారని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అతన్ని పట్టుకున్నారని, కేసు నమోదుచేసి ఒకర్ని అరెస్ట్ చేశామని తెలిపారు. ఘటనకు సంబంధించి ఇరు వర్గాలనుంచి ఫిర్యాదులు అందాయని చెప్పారు.
తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుంటామని, పోలీస్ సిబ్బంది తప్పుందని తేలినా చర్యలు తప్పవన్నారు. టీడీపీ, బీజేపీ మధ్య అలిపిరి ఘటన తీవ్ర మాటల యుద్దానికి దారితీసింది. చంద్రబాబు ఆదేశం మేరకే టీడీపీ కార్యకర్తలు అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లదాడి జరిపారని… దీనిపై ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అమిత్ షా కాన్వాయ్ పై అసలు రాళ్లదాడే జరగలేదని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. పోలీస్ దర్యాప్తులో కూడా ఇదే విషయం వెల్లడయింది. మరోవైపు అలిపిరి ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వొద్దని పార్టీ శ్రేణులను ఆదేశించారు.