ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్తనందించింది. అదేంటంటే దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే రైతులకు పట్టాదారు పాస్ బుక్ అందించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఒకప్పుడు తర్వాత చూద్దాం అనుకుంటూ దరఖాస్తుల పరిష్కారాన్ని అధికారులు కాస్త ఆలస్యం చేసేవారు ఇక ఆ ఆలస్యం కూడా కాకుండా మొత్తం ప్రక్రియను వెబ్‌ల్యాండ్‌తోపాటు సీసీఎల్ఏ డ్యాష్‌బోర్డుకు అనుసంధానం చేయనుంది ఏపీ ప్రభుత్వం. దరఖాస్తు చేసుకొన్న 21 రోజుల్లోనే పరిశీలన పూర్తి చేసి రైతుకు పట్టాదారు పాస్‌బుక్, టైటిల్‌డీడ్ అందజేయాల్సిందే. మార్గదర్శకాలకు లోబడి ఉండి, రిజిస్ట్రేషన్‌కు అర్హత కలిగి ఉండి గడువులోగానే పాస్‌బుక్‌తోపాటు టైటిల్ డీడ్ అందించాలంటూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
జూన్ 22నే దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఆగస్టు 4వ తేదీ వరకూ మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకొంటారు. ‘మీ సేవ’లో దరఖాస్తు అందిన రెండో రోజు నుంచే పరిశీలించి ఐదో రోజు నాటికి నోటీసులు అందజేసి, పన్నెండో రోజులోగా రైతులను విచారించేలా మార్గదర్శకాలు జారీ చేశారు. పదమూడో రోజుకు తహసీల్దర్కు నివేదిక అందజేసి, పద్దెనిమిదో రోజుకు రిజిస్ట్రేషన్ పూర్తి కావాలని, 21వ రోజునాటికి రైతు చేతికి పాస్ బుక్, టైటిల్ డీడ్ అందాలని సూచించారు.