Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన హామీల కోసం టీడీపీ చేస్తున్న పోరాటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారు. స్వాతంత్య్రం కోసం పోరాడడం గత చరిత్ర అయితే…రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడడం ప్రస్తుత చరిత్ర అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై ఆయన జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడున్నరేళ్లగా కేంద్రానికి అన్ని విధాలా సహకరించామని, జీఎస్టీ,నోట్లరద్దు వంటి పరిణామాలు తలెత్తినప్పుడు కేంద్రానికి అండగా నిలిచామని సీఎం అన్నారు.
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి కేంద్రం మరింత సహకారం అందించి, పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేవరకూ చేయూతనివ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న ఎంపీలందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమేనని అన్నారు. ప్రతిపక్షం లేఖల ద్వారా అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోందని దుయ్యబట్టారు. తెలిసి చేసినా, తెలియక చేసినా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఫిర్యాదులు పంపడం ప్రతిపక్షం అరాచకాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.