ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 19-20 బడ్జెట్‌ను కొద్ది గంటల్లో శాసనసభలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రజలకు తాయిలాలు ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని చెబుతోన్న కూడా ఇది విస్తృత స్థాయి బడ్జెట్ లాగే ఉండొచ్చని, రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేలా ఉండొచ్చని తెలుస్తోంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సూచనప్రాయంగా ఈ విషయం వెల్లడించారు.
రాష్ట్ర బడ్జెట్ సుమారు రూ.2.26 లక్షల కోట్ల మేర ఉండొచ్చని అంచనాలున్నాయి. ఉదయం 11.45 గంటలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసన సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకాలతో పాటు మరికొన్ని కొత్త వరాలు ఈ బడ్జెట్లో ప్రకటించే అవకాశముంది. సాగునీటి, వ్యవసాయ రంగాలకు కేటాయింపులు మరింత పెంచొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ రైతులు, మహిళలు, పేదలు, యువత, నిరుద్యోగులకు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. 2019-20 బడ్జెట్లో వ్యవసాయ రంగం, రైతులు, మహిళలు, పేదలు, యువత, నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1.11 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ మొత్తం రెట్టింపు అవుతుండటం గమనార్హం.