ప్రపంచంలో ది బెస్ట్ కంప్యూటర్, ది బెస్ట్ మొబైల్ ఫోన్ ఏది అంటే ఎవరైనా తడుముకోకుండా చెప్పే మాట యాపిల్ ఫోన్, యాపిల్ మ్యాక్ కంప్యుటర్. యాపిల్ అనే సంస్థ జనాల్లోకి అంత బాగా చొచ్చుకుపోయింది. అసలు ఆ సంస్థ అంటేనే సంచలనాలకి కేరాఫ్ అలాంటి సంస్థ ఇప్పుడు మరో సంచలనాన్ని క్రియేట్ చేసింది. అదేంటంటే మార్కెట్ విలువలో ప్రపంచంలోనే వన్ ట్రిలియన్ అంటే లక్ష కోట్ల డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు 69 లక్షల కోట్లు) మార్కెట్ చేజిక్కుంచుకున్న తొలి కంపెనీగా యాపిల్ రికార్డు సృష్టించింది. నిన్న జరిగిన ప్రపంచ ట్రేడింగ్ లో షేర్ విలువ ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 207.05 డాలర్స్ కి చేరింది. దీంతో లక్ష కోట్ల డాలర్ల సంస్థగా యాపిల్ నమోదయ్యింది.
నిన్న మార్కెట్ దెబ్బకి అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ తదితర సంస్థలను తోసిరాజని యాపిల్ గ్లోబల్ మార్కెట్ లీడర్‌గా అవతరించింది. ఈ ఏప్రిల్-జూన్ క్వార్టర్ లో అంచనాలకు మించి లాభాలు నమోదైన కారణంగా గత రెండు మూడు రోజుల నుంచి యాపిల్ షేర్లు దూకుడు మీదున్నాయి. దీంతో వాటి మీద విపరీతమైన ఆసక్తి చూపడంతో మూడు రోజుల్లో కంపెనీ షేర్ విలువ సుమారు 9 శాతం ఎగిసింది. ఈ క్రమంలోనే సంస్థ మార్కెట్ విలువ చారిత్రక స్థాయికి దూసుకెళ్లింది. 1976 ఏప్రిల్ 1న అమెరికాలోని కాలిఫోర్నియాలోగల కూపర్టినోలో యాపిల్ సంస్థను స్టీవ్ జాబ్స్ తదితరులు కలిసి స్థాపించారు. 1980లో యాపిల్ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించింది. అయితే ఐపాడ్‌ను ఆవిష్కరించిన 2001 అక్టోబర్‌లో 6 బిలియన్ డాలర్లుగా ఉన్న యాపిల్ మార్కెట్ విలువ ఇప్పుడు ఏకంగా వన్ ట్రిలియన్ అంటే లక్ష కోట్ల డాలర్ల మార్క్ ను అందుకోవడం గమనార్హం.