పార్లమెంటు ఉభయ సభలు ఇవాళ నిరవధిక వాయిదా పడ్డాయి. ఓవైపు అవిశ్వాస తీర్మానం.. మరోవైపు మణిపుర్ అంశంపై వాడీవేడిగా సాగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ నిరవధికంగా వాయిదా పడ్డాయి. సభ దాదాపు 39 గంటలు పనిచేసిందని వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కీలకమైన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2023, దిల్లీ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపిందని చెప్పారు. మరోవైవు, రాజ్యసభను కూడా నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ప్రకటించారు. గుర్రపు పందేలు ,క్యాసినో,ఆన్లైన్ గేమింగ్ ల పై 28 శాతం పన్ను విధించే బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో ఎలాంటి చర్చ లేకుండా ఇంటిగ్రేటెడ్ వస్తుసేవల పన్ను సవరణ బిల్లు 2023, కేంద్ర వస్తు సేవల పన్ను సవరణ బిల్లు 2023కు లోక్సభ, రాజ్యసభ ఆమోదం తెలిపాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ రెండు సభల్లోనూ ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. రాష్ట్రాల శాసనసభలు పార్లమెంట్ ఆమోదం పొందడం వల్ల ఈ మేరకు కూడా జీఎస్టీ చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంటుంది.