Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సరిగ్గా ఏడాది క్రితం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సర్జికల్ స్ట్రయిక్ నిర్వహించిన భారత్ ఇప్పుడు మయన్మార్ సరిహద్దుల్లో భీకర పోరు జరిపింది. బుధవారం ఉదయం 4.45 గంటల సమయంలో భారత జవాన్లు నాగా తీవ్రవాదుల శిబిరాలపై మెరుపు దాడులు జరిపారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. మయన్మార్ సరిహద్దు వద్ద లెంఖు గ్రామంలో నాగా తీవ్రవాదుల శిబిరాలపై దాదాపు 70 మంది భారత పారా కమాండోలు దాడులు జరిపారని తెలిపింది. ఈ దాడుల్లో చాలా మంది తీవ్రవాదులు చనిపోయారని, సైనికులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. దాడుల సందర్భంగా అంతర్జాతీయ సరిహద్దులను దాటలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు తూర్పు కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. నాగా తీవ్రవాదులు జరిపిన కాల్పులను భారత జవాన్లు దీటుగా తిప్పికొట్టారని తెలిపింది. భారత్ జవాన్ల ప్రతిఘటనతో నాగా తీవ్రవాదులు కొందరు పారిపోయారని, మరికొందరు సైన్యం చేతిలో హతమయ్యారని వెల్లడించింది. గత ఏడాది ఈ సమయంలో భారత సైన్యం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్ లో 40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కేవలం గంట వ్యవధిలో జరిపిన ఈ మెరుపుదాడిలో పీవోకేలోనీ నాలుగు ఉగ్రస్థావరాలను, అందులోని ముష్కరులను మట్టుబెట్టింది భారత ఆర్మీ.