కేంద్రప్రభుత్వం ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము బీజేపీ తరఫున ప్రచారం చేస్తామని, ప్రతి ఒక్కరి ఓటు ఆ పార్టీకి అనుకూలంగా పడేలా ఆప్ కృషిచేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. అలాగే తమ డిమాండ్ల సాధన కోసం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం సీఎం కేజ్రీవాల్… డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఇద్దరు మంత్రులతో కలిసి అకస్మాత్తుగా బైఠాయించడం ఉత్కంఠకు దారితీసింది. ఎల్జీ కేంద్రం తొత్తుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నారని కేజ్రీవాల్ విమర్శించగా, ముఖ్యమంత్రి బెదిరింపు చర్యలకు దిగుతున్నారని ఎల్జీ కార్యాలయం ఆరోపించింది.
ప్రజలకు ఇంటివద్దకే రేషన్ సరుకులు అందించే ప్రక్రియకు ఆమోదం, నాలుగు నెలలుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్ అధికారులపై చర్యలు, అధికారులు వెంటనే సమ్మె విరమించేలా చొరవ చూపడం వంటి మూడు ప్రధాన డిమాండ్లకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంపై కేజ్రీవాల్ తీవ్ర నిరసన తెలిపారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మంత్రులు సత్యేంద్రకుమార్ జైన్, గోపాల్‌రాయ్‌లతో కలిసి ఎల్జీని మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే, ఎల్జీ నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో వారు ఆయన కార్యాలయంలోని వెయిటింగ్ రూంలో అకస్మాత్తుగా బైఠాయించారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తేలేదని వారు తేల్చిచెప్పారు. నాలుగు నెలలుగా పలు దఫాలుగా ఎల్జీని కలిసి విన్నవించినా తమ డిమాండ్లను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, అందుకే కార్యాలయంలోనే బైఠాయించినట్లు కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అక్కడున్న సోఫాపై రాత్రి నిద్రపోయారు. అక్కడికే ఆహారాన్ని తెప్పించుకుని తిన్నారు. మధుమేహ వ్యాధి ఉండటంతో ఇన్సులిన్ ఇంజక్షన్ ను కూడా అక్కడే తీసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నిరసన రెండో రోజుకు చేరినప్పటికీ గవర్నర్ కార్యాలయం నుంచి ఇంకా ఎటువంటి పిలుపూ రాలేదని తెలుస్తోంది. కాగా, గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఢిల్లీ సీఎం ఎల్జీని బెదిరిస్తున్నారని, ఎలాంటి కారణం లేకుండానే ఆయన అకస్మాత్తుగా నిరసనకు దిగారని ఆరోపించడం గమనార్హం.