ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిన్నకూకట్‌పల్లి లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోసంరక్షణ అంటూ గోవధకి వ్యతిరేకంగా పోరాడే బీజేపీ పార్టీ చీఫ్ అమిత్ షా కి కళ్యాణి బిర్యానీ పంపిస్తానని సభా సాక్షిగా అనడం ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువు అయ్యింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిత్ షా తన ప్రసంగంలో భాగంగా హైద్రాబాద్లోని ముస్లింలకు కేసీఆర్ బీఫ్ బిర్యానీ పంపుతున్నారని విమర్శించాడు. అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలను అసదుద్దీన్ ఒవైసీ కాస్త ఘాటు సమాధానం తోనే తిప్పికొట్టారు.
నిన్న తన ప్రసంగంలో అసదుద్దీన్ ఒవైసీ “కేసీఆర్ ఒవైసీ కి మాత్రమే బిర్యానీ పంపి, తనకి పంపకపోవడంతో అమిత్ షా ఈర్ష్య పడుతున్నారని అనిపిస్తుంది. ఆయనకు కళ్యాణి బిర్యానీ ఇష్టమని నాకు ఇంతవరకు తెలియదు. ఒకవేళ అమిత్ షా తనకి కూడా బిర్యానీ పంపలేదని ఈర్ష్య పడుతున్నట్లయితే అతనికి కళ్యాణి బిర్యానీ పంపించమని నేను కేసీఆర్ కి చెబుతాను. లేదంటే నేనే స్వయంగా బిర్యానీ పార్సెల్ పంపిస్తాను” అని అన్నారు. అంతేకాకుండా మేము ఏమి తింటే మీకెందుకు? మీకు కావాలంటే చెప్పు, మీకు కూడా ఒక పార్సెల్ పంపిస్తాం గానీ మాకు మాత్రం దిష్టి పెట్టకు అని అమిత్ షా ని ఎద్దేవా చేసాడు ఒవైసీ. ఇంతటితో ఆగకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని కూడా ఈ విషయంలోకి లాక్కొచ్చి ” పాకిస్థాన్ లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ తన కూతురి పెళ్ళికి ఆహ్వానం ఇవ్వకున్నా, వెళ్లిన నరేంద్ర మోడీ అక్కడ ఏమి తిన్నారో ఎవరికి తెలుసు. మేమైనా ఆ విషయం గురించి అడిగామా? సంబంధంలేని అనవసరమైన ప్రసంగం చేసి, మీ పరువుని మీరే తీసుకోకండి అమిత్ జీ” అంటూ అమిత్ షా కి హితవు పలికారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.