Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నమ్మిన దేవుడే అత్యాచారం జరిపాడు. ఆ దేవుడితో పోరాడగలమా అనుకున్నాం… ఓ బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ గురించి బాధితురాలి తల్లి అన్న మాటలివి. ఆశారాం బాపు తమకు దేవుడులాంటివారని, అలాంటి దేవుడే తనపై అత్యాచారం జరిపాడంటే నమ్మలేకపోతున్నామని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. తన కూతురుపై జరిగిన దారుణం, ఆశారాంకు వ్యతిరేకంగా జరిపిన న్యాయపోరాటం గురించి ఆమె ఓ ఆంగ్ల మీడియాకు వివరించారు. ఆశారాం బాపూ తమ దేవుడని, కొన్నేళ్లపాటు తమ జీవితాలు ఆయన చుట్టూనే తిరిగాయని, ఒక రోజు ఆ దేవుడు తమ సంతోషాన్ని లాగేసుకుని తమ జీవితాలు నాశనం చేశాడని, 16 ఏళ్ల తన కూతురిపై అత్యాచారం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని తన బిడ్డ చెప్పినప్పుడు ఆ మాటలు జీవితంలో దురదృష్టకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయాయని, తన భర్తతో ఆ విషయం చెప్పినప్పుడు ఆయన కుప్పకూలిపోయారని, ఆయన్ని ఆ విధంగా చూడడం అదే తొలిసారని ఆమె గుర్తుచేసుకున్నారు.
తమ కూతురు పుట్టినతర్వాతే తమకు అదృష్టం కలిసి వచ్చిందని తన భర్త నమ్ముతారని, అలాంటి కూతురు పట్ల ఇంత దారుణం జరిగిందని తెలిసి ఆయన తల్లడిల్లిపోయారని చెప్పారు. ఆ రోజు తమ కుటుంబంలో ఎవరికీ తిండీ నిద్ర లేదని, కలలో కూడా ఊహించని ఘటన తమ జీవితాల్లో జరిగిందని బాధపడ్డారు. తాము దైవంగా భావించే ఆశారాం తమ బిడ్డపై అత్యాచారం జరిపాడని, ఓ దేవుడు తమ జీవితాలను నాశనం చేశాడని ఎలా ఆరోపించగలమని, ఒక దేవుడితో ఏ విధంగా పోరాడగలమని తాను ఆలోచించానన్నారు. ఈ ఆలోచనలతో తాను సతమతమవుతుండగానే మరుసటిరోజు తన భర్త ఆశారాంపై ఫిర్యాదుచేయడానికి వెళ్లారని చెప్పారు. ఆశారాం చేసిన దారుణం గురించి తమ కుమార్తె చెప్పగానే ఆయన్ను నిలదీయడానికి తన భర్త ఆశ్రమానికి వెళ్లారని, కానీ భక్తులు ఆయన్ని లోపలికి రానివ్వలేదని తెలిపారు. కేసు పెట్టాక అందరూ కేసు వాపసు తీసుకోవాలని సలహా ఇచ్చారని, కానీ తాము ఒప్పుకోలేదని, నాన్నా… నువ్వు భయపడకు. నాకు ఏమీ కాదు అని తన కూతురు ధైర్యం చెప్పేదని, కన్నీళ్లు ఆపుకుని తమకు అండగా నిలబడిందని, కేసుతో పోరాడి గెలిచిందని చెప్పారు.
ఆశారాంను భగవంతుడిగా పూజించే తన భర్తను చూసే కుటుంబమంతా ఆయన భక్తులమయ్యామని, ఆయనపై ఉన్న నమ్మకంతోనే ఓ ప్రయివేట్ పాఠశాలలో చదువుతున్న తన కొడుకు, కూతురిని ఆశారాం నడుపుతున్న ఆశ్రమంలో చేర్పించామని తెలిపారు. ఆశారాం గురించి తప్పుడు ఆరోపణలుచేసిన వారితో తాము మాట్లాడేవారం కాదని, మధ్యతరగతి కుటుంబమే అయినప్పటికీ తన భర్త నెలకు సంపాదించిన సొమ్ములో కొంత ఆశ్రమానికి విరాళంగా ఇచ్చేవారని, తమ ఇంటి ఆవరణలో ఆశారాం పేరిట చిన్న ఆశ్రమం కూడా కట్టించారని, అంతగా నమ్మిన ఆయనే తమ జీవితాలను కుదిపేస్తారని ఊహించలేకపోయామని వాపోయారు. ఆయన తమ గౌరవాన్ని, పరువును లాగేసుకున్నారని, సమాజంలో తలెత్తుకుని తిరగనీకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయనకు వ్యతిరేకంగా పోరాడాలని అనుకున్నందుకు తమను చంపించాలనుకున్నారని, రెండేళ్ల నుంచి తమ బిడ్డకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో షాజహాన్ పూర్ నుంచి జోధ్ పూర్ కు ప్రయాణాలు చేశామని, కానీ తన బిడ్డ మాత్రం వెనక్కి తగ్గాలనుకోలేదని, న్యాయమూర్తి ఎదుట తనకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తున్నప్పుడు తన కూతురు తన కళ్లకు హీరోగా కనిపించదని ఆమె వ్యాఖ్యానించారు.
తన కూతురు ధైర్యాన్ని చూసి తమ తరపున వాదించిన న్యాయవాది కూడా ఆశ్చర్యపోయారన్నారు. కేసువిషయంలో తాము బిజీగా ఉండడంతో తమ రెండో కూతురు, కుమారుడు చదువు ఆపేసి వ్యాపారం చూసుకున్నారని తెలిపారు. ఆశారాం సహచరుల నుంచి వచ్చే బెదిరింపులు తట్టుకోలేకపోయామని, తమ కేసులో సాక్ష్యులుగా ఉన్న కొందరిని హత్య చేయించారని చెప్పారు. ఎట్టకేలకు ఆశారాంకు శిక్ష పడిందని, తాము చేసిన ప్రయత్నాలు ఫలించినందుకు సంతోషం కలిగిందని తెలిపారు. ఇప్పుడు తన కూతురి ముఖంలో నవ్వు చూడగలుగుతున్నానని, అన్నీ మర్చిపోయి చదువుకుంటోందని, బ్యాడ్మింటన్, పెయింటింగ్ నేర్చుకుంటోందని, సివిల్స్ కు సిద్ధముతోందని చెప్పారు. ఎన్ని జన్మలెత్తినా తన కూతురికే తల్లిగా పుట్టాలని ఉందన్నారు.