Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రోజాగా పిలిచే ఉపవాసదీక్షలను ముస్లింలు ఎంత కఠినంగా ఆచరిస్తారో తెలిసిందే. పగలంతా పచ్చి మంచినీళ్లయినా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తారు. ఎంతటి విషమ పరిస్థితులు ఎదురయినప్పటికీ ఉపవాస దీక్ష నిలిపివేయరు. పగటిపూట దీక్షలో ఉన్న సమయంలో ఏమన్నా అనారోగ్యం కలిగినా..సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత దీక్ష విరమించే వైద్యుని దగ్గరకు వెళ్తారు. అందరు ముస్లింలలానే ఇలా కఠిన దీక్ష ఆచరించే ఆష్కఫ్ అర్ధాంతరంగా దీక్ష విరమించాడు. అయినా సరే ఆయన్ను ఎవరూ విమర్శించడం లేదు. దీక్ష ఆపేసి తప్పుచేశావనడం లేదు… అంతేకాదు… దీక్ష అకస్మాత్తుగా విరమించినందుకు మెచ్చుకుంటున్నారు కూడా… దీనికి కారణం ఆష్కఫ్ దీక్ష విరమించడం వెనక ఓ మంచి ఉద్దేశం ఉండడమే. వివరాల్లోకి వెళ్తే… సశస్త్ర సీమా బల్ లో బాధ్యతలు నిర్వహిస్తున్న రమేశ్ సింగ్ అనే జవాన్ కు రెండు రోజుల క్రితం అమ్మాయి పుట్టింది. అయితే పాప అనారోగ్యంతో పుట్టడంతో ఆమెకు రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఆ పాప బ్లడ్ గ్రూప్… ఓ నెగటివ్… అరుదైన గ్రూప్… చిన్నారికి వైద్యం అందిస్తున్న ఆస్పత్రిలో ఆ రక్తం అందుబాటులో లేదు. దాంతో రమేశ్ సింగ్, ఆయన భార్య ఆర్తి కుమారి కలిసి తమ బిడ్డకు సాయం చేయాల్సిందిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఆ పోస్ట్ లు చూసి స్పందించిన ఆష్కఫ్ సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నప్పటికీ… తన రోజా కన్నా బిడ్డ ప్రాణం ముఖ్యం అనుకుని వెంటనే పాప చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి పండ్లు తిని దీక్ష విరమించాడు. అనంతరం చిన్నారికి రక్తదానం చేశాడు. సరైన సమయానికి రక్తం అందడంతో పాప బతికింది. దీనిపై ఆష్కఫ్ సంతోషం వ్యక్తంచేశాడు. తనకు ఉపవాసం కంటే పాపను బతికించడం ముఖ్యం అనిపించిందని ఆష్కఫ్ చెప్పాడు. ఆ చిట్టితల్లి మనదేశాన్ని కాపాడుతున్న జవాన్ కూతురని, సాయం చేయడానికి ఇంతకంటే మంచి కారణం ఇంకేముంటుందని ప్రశ్నించాడు. ఆ స్థానంలో హిందువు ఉన్నా, మరే మతానికి చెందినవారున్నా సాయం చేసేవాడినని తెలిపాడు. ఉపవాసం ఈ రోజు కాకపోతే మరోరోజు ఉండగలనని, కానీ పాపను బతికించినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. పవిత్రమైన రంజాన్ మాసంలో బిడ్డను కాపాడమని అల్లా తనను ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నాడు ఆష్కఫ్. తోటివారికి సాయపడాలన్నదే అల్లా అభిమతమని, తన ప్రవర్తనతో ఆష్కఫ్ రంజాన్ ఉపవాసదీక్షకు అసలైన అర్ధం చెప్పాడని పలువురు ముస్లింలు ప్రశంసిస్తున్నారు