Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్ నుంచి అమరావతికి పాలన కేంద్రం మారింది కానీ టీడీపీ కేంద్ర కార్యాలయం ఆ స్థాయిలో నిర్మాణం జరగలేదు. ఇప్పటిదాకా తాత్కాలిక కార్యాలయాల్లోనే అధికార టీడీపీ కాలం వెళ్లదీస్తూ వస్తోంది. త్వరలోనే ఈ పరిస్థితి మారనుంది. ఈ నెల రెండు లేదా నాలుగో వారంలో టీడీపీ హెడ్ ఆఫీస్ పనులకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఓ మంచి ముహూర్తాన దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన కి వుండే సమయాన్ని బట్టి శంకుస్థాపన కార్యక్రమం చేయడానికి యువ నేత లోకేష్ ప్రయత్నిస్తున్నారు.
మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 3 . 9 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం జరిగిపోయింది. ఇక్కడ పార్టీ కార్యాలయం నిర్మిస్తే మొత్తం 13 జిల్లాల వారికి నడిమధ్యన ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ హెడ్ ఆఫీస్ కి సంబంధించిన డిజైన్ ఖరారు చేయడానికి ఇప్పటికే లోకేష్ టీం కసరత్తు చేస్తోంది. ఈ రెండు మూడు రోజుల్లో ఓ డిజైన్ ని ఓకే చేసే అవకాశం వుంది. అయితే ఆ డిజైన్ ని బయట పెట్టే ముందు సీఎం చంద్రబాబు అనుమతి తీసుకోనున్నారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డిజైన్ తో నవంబర్ రెండు లేదా నాలుగో వారంలో కార్యాలయ భవన శంకుస్థాపన జరుగుతుంది. మొత్తం 6 నుంచి 9 నెలల్లోపు ఈ భవన నిర్మాణం పూర్తి చేసి వచ్చే ఎన్నికల ప్రచార సందడి మొదలు అయ్యేలోగా ఇక్కడ నుంచే పార్టీ కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుడతారు.