మిర్యాలగూడ పరువు హత్య కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్ హత్యను ఇంకా ఎవరూ మర్చిపోకముందే అలాంటి ఘటనే హైదరాబద్ నడిబొడ్డున చోటుచేసుకుంది. తనకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఆమెను ఆమె ప్రియుడిని ఇద్దరినీ కత్తితో నరికి దాడి చేసాడు ప్రేమికురాలి మేనమామ.
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రేమికులు సందీప్, మాధవీలుగా పోలీసులు గుర్తించారు. మాధవి మేనమామే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తనకు ఇష్టం లేని వ్యక్తిని తన మేనకోడలు ప్రేమిందనే కారణంతో కక్ష పెంచుకున్న మాధవి ఆయన ప్రేమికుల పై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో సందీప్, మాధవిలు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం సనత్ నగర్ నీలిమ హాస్పిటల్ కు తరలించారు. మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడి అనంతరం మాధవి మేనమామ పరారయ్యాడు. కులాంతర వివాహమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.