అక్రమ నిర్మాణం అని తేలిన నేపధ్యంలో ప్రస్తుతం తాను ఉంటున్న ఉండవల్లిలోని నివాసాన్ని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిని కూడా జగన్ ప్రభుత్వం కూల్చివేసే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే బాబు అమరావతి ప్రాంతంలో మరో ఇంటి కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అనువైన నివాసం దొరికిన వెంటనే ప్రస్తుతం తాను ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయన భావిస్తున్నారట. ప్రస్తుతం తాను ఉంటున్న నివాసానికి ఆనుకుని ఉన్న ప్రజా వేదికను ఇప్పటికే కూల్చి వేశారు. దాన్ని కూల్చివేసిన తర్వాత బాబు ఉంటున్న భవనాన్ని కూల్చే వేసే అవకాశాలున్నాయని అంటున్నారు. బాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమేనని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ దాన్ని కూడా కూల్చివేయక తప్పదని, పరోక్షంగా బాబు తన నివాసాన్ని ఖాళీ చేయాలనే సంకేతాలు ఇస్తున్నారు. అందుకే కొత్త ఇల్లు వెదికే పనిలో పడ్డారు. గుంటూరుకు, విజయవాడకు త్వరగా చేరుకునే విధంగా తన నివాసం ఉండాలని భావిస్తున్నారట. మరోవైపు, రాజధాని ప్రాంతంలోని ఉద్ధండరాయుని పాలెం గ్రామానికి చెందిన టీడీపి నేతలు కొందరు ఇల్లు కట్టుకోవడానికి చంద్రబాబుకు స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.