Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బంగ్లాదేశ్ తాను క్రికెట్ లో పసికూన కాదని మరోసారి నిరూపించింది. ఏకంగా ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. చిట్టగాంగ్ లో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు అరుదైన ఘనత సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 513 పరుగుల భారీ స్కోర్ నమోదుచేసింది. ఈ మొత్తం పరుగుల్లో ఒక్క బై కానీ, లెగ్ బై గానీ లేవు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా బై, లెగ్ బై లేకుండా 513 పరుగులు నమోదవడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరుతో ఉండేది. 2014లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా బై, లెగ్ బైలు లేకుండా ఏడు వికెట్ల నష్టానికి 494 పరుగులు చేసింది.
నాలుగేళ్ల తర్వాత ఆ రికార్డును బంగ్లాదేశ్ చెరిపివేసింది. చిట్టగాంగ్ టెస్టులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొమినుల్ హక్ 176 పరుగులు, ముష్ఫికర్ రహీం 92 పరుగులు చేయడంతో పాటు ఇతర బ్యాట్స్ మెన్ కూడా రాణించడంతో 513 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బంగ్లాదేశ్ కు టెస్టుల్లో ఇది ఐదో అత్యధిక స్కోర్. ఒకప్పుడు పసికూనగా ఉన్న బంగ్లాదేశ్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో మంచి విజయాలు సాధిస్తూ పెద్ద జట్లకు గట్టి పోటీఇస్తోంది.