తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సోమవారం టీడీపీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై ఆయన పార్టీ నేతలతో చర్చించారు. మహాకూటమితో పొత్తు, సీట్ల సర్దుబాటు అంశాలపై ఎక్కువ సేపు చర్చించినట్టు తెలుస్తోంది. చర్చల్లో భాగంగా టీడీపికి మంచి పట్టు ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ఎవరిని బరిలోకి దించాలనే ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కూకట్‌పల్లి నుంచి పెద్దిరెడ్డిని, శేరిలింగంపల్లి నుంచి భవ్య సిమెంట్స్ అధినేత ఆనంద్‌ప్రసాద్‌ను బరిలో దింపాల్సిందిగా ఆయన సూచించినట్టు సమాచారం. ఈ నియోజకవర్గాల్లో దాదాపుగా వీరి పేర్లు ఖరారైనట్టే అన్న వాదన వినిపిస్తోంది.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అందుకే గత ఎన్నికల్లో టీడీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఈసారి కూడా సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల విషయంలో చంద్రబాబు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బలమైన లేదా కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుండటంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలిచే విధమైన అభ్యర్థులపై చంద్రబాబు దృష్టి సారించారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి సరైన నేతను బరిలోకి దింపి మళ్లీ గెలవాలని బాబు భావిస్తున్నారు. దీంతో పార్టీకి ఎన్నోమార్లు సహాయ, సహకారాలు అందించిన ఆనంద్ ప్రసాద్ కే బాబు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. పైగా వివాదరహితుడు, సౌమ్యుడు అనే పేరున్న ఆయనకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆశీసులు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు కూడా ఆయనకు టిక్కెట్ ఇస్తే గెలిపించుకుంటామని చెప్పారట. దీంతో ఆయనకు సీటు ఖరారైందనే ప్రచారం సాగుతోంది. బాలకృష్ణ కూడా ఇక్కడ ప్రచారం కూడా చేయనున్నారని తెలుస్తోంది.