Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ చిత్రం ‘బాహుబలి’. బాలీవుడ్ చిత్రాలను సైతం తలదన్నేలా కలెక్షన్స్‌ను సాధించిన బాహుబలి వంటి చిత్రాన్ని చివరకు రాజమౌళి కూడా మళ్లీ తెరకెక్కించలేడు అనేది చాలా మంది మాట. అయితే బాహుబలిని తాను రీమేక్ చేస్తాను అంటూ భోజ్‌పురికి చెందిన ఒక నిర్మాత ముందుకు వచ్చాడు. అధికారికంగా రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్న ఆ నిర్మాత తాజాగా చిత్రీకరణ కూడా మొదలు పెట్టాడు. బాహుబలి వంటి అద్బుతాన్ని మళ్లీ సృష్టించడం అంటే అది అసాధ్యం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని పబ్లిసిటీ కోసమో లేదా మరే కారణమో కాని ‘బాహుబలి’ రీమేక్ చేసేందుకు భోజ్‌పురి నిర్మాత దినేశ్‌లాల్ యాదవ్ ప్రకటించాడు.
ప్రస్తుతం మహారాష్ట్రలోని ఒక గ్రామంలో చిత్రీకరణ జరుపుతున్నారు. బాహుబలి స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఈ చిత్రానికి ఇక్బాల్ భక్ష్ దర్శకత్వం వహిస్తున్నాడు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి ‘వీర్ యోధా మహాబలి’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. తాజాగా ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేయడంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ విషయమై చర్చ జరుగుతుంది.
త్వరలోనే టీజర్‌ను విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. ‘బాహుబలి’ చిత్రాన్ని రీమేక్ చేయడం అనేది ఒక పిచ్చి ప్రయత్నం అని, అసలు ‘బాహుబలి’ నిర్మాతలు అయిన శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేనిలు ఎలా రీమేక్ రైట్స్‌ను అమ్మారు అంటూ తెలుగు సినీ ప్రేమికులు, ప్రేక్షకులు, సినీ వర్గాల వారు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ‘బాహుబలి’లో కనీసం 10 శాతం అయినా ‘వీర్ యోధా మహాబలి’ చిత్రం ఉంటుందా అనేది చూడాలి.