Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్డీయేతో చెలిమి తరువాత బీహార్ పాలకపక్షం జేడీయూ కుదుపులకు లోనవుతోంది. జేడీయూ-బీజేపీ మైత్రిని వ్యతిరేకిస్తున్న సీనియర్ నేత శరద్ యాదవ్ వర్గంపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాజ్యసభలో జేడీయూ పక్ష నేతగా ఉన్న శరద్ యాదవ్ ను ఆ పదవి నుంచి తొలగించి ఆర్సీపీ సింగ్ ను నియమించిన నితీశ్ తాజాగా మరో క్రమశిక్షణాచర్య తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ శరద్ యాదవ్ వర్గానికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను జేడీయూ సస్పెండ్ చేసింది. పార్టీ బీహార్ అధ్యక్షుడు వశిష్ట నారాయణ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీలో తలెత్తిన అసమ్మతిని మొగ్గలోనే తుంచేయాలన్న భావనతోనే నితీశ్ వర్గం శరద్ యాదవ్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని, ఎన్డీయేతో దీర్ఘకాల స్నేహాన్ని కొనసాగించాలన్న ఉద్దేశమే దీనికి కారణమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఎన్డీయే కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టకముందే.. నయానో భయానో శరద్ యాదవ్ ను, ఇతర అసంతృప్తవాదులను లొంగదీసుకుని…పార్టీని ఒక్కతాటిపై నడిపించాలని నితీశ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్వహించిన విపక్షాల సమావేశానికి హాజరయిన రాజ్యసభ సభ్యుడు అలీ అన్వర్ ను కూడా సప్పెండ్ చేయటం ఇందులో భాగమే. గత అసెంబ్లీ ఎన్నికల కోసం మహా కూటమితో జతకట్టటానికి ముందు వరకు ఎన్డీయే, నితీశ్ ల మధ్య మంచి బంధమే ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల వరకు బీహార్ సీఎం ఎన్డీయేతోనే కలిసి నడిచారు. అప్పుడెప్పుడూ శరద్ యాదవ్…నితీశ్ అభిప్రాయాలతో విభేదించలేదు. అయితే బీజేపీకి వ్యతిరేకంగానే మహా కూటమి ఏర్పాటుచేసి కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తరువాత..,.అర్ధాంతరంగా తెగతెంపులు చేసుకోవటంతో పాటు.ఏ పార్టీకి వ్యతిరేకంగా కూటమి కట్టారో …ఆ పార్టీతోనే మళ్లీ స్నేహం చేయటమేమిటని శరద్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు.
మహాకూటమిని చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వం వేసిన ఎత్తుగడలో నితీశ్ చిక్కుకున్నారన్నది శరద్ యాదవ్ భావన. కానీ 15 ఏళ్లు సీఎం గా పనిచేసినా మిస్టర్ క్లీన్ ఇమేజ్ పోగొట్టుకోకుండా పాలన చేస్తున్న నితీశ్…అవినీతిమయమైన ఆర్జేడీతో చెలిమి…దీర్ఘకాలికంగా తనకు చేటు చేస్తుందనే భావనలో ఉన్నారు. ఒకప్పుడు ఎన్డీయేతో కలిసే అధికారం పంచుకున్న నితీశ్ కు పాత చెలిమే ఆమోదయోగ్యంగా అనిపించింది.
మరిన్ని వార్తలు: