జమ్మూ-కశ్మీరు ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగింది. దీంతో జమ్ముకశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ బంధం తెగిపోయింది. ఈ విషయంపై బీజేపీ అధికారికంగా ప్రకటన చేసింది. ఈరోజు న్యూఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ పీడీపీతో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగించే పరిస్థితులు ఇకలేవని దీంతో రాష్ట్రపతి పాలనకు తాము డిమాండ్ చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం, హింస, తిరుగుబాట్లు అధికమయ్యాయని, అక్కడి పౌరుల ప్రాథమిక హక్కులు కూడా ప్రమాదంలో పడ్డాయని, ఇటీవల పత్రికా సంపాదకుడు షుజాత్ బుఖారిని హత్య చేయడమే అందుకు ఉదాహరణని అన్నారు. పీడీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగే అవకాశం ఇక మీదట లేదని తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. పార్టీలోని అందరి సమ్మతితో జమ్మూ-కశ్మీరు ప్రభుత్వం నుంచి వైదొలగాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలిపారు. పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు సమయంలో కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకున్నామని రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడం, వేగంగా అభివృద్ధి జరిగేలా ప్రోత్సహించడం కోసం తాము పీడీపీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వాములమయ్యామన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా లడఖ్, జమ్మూ-కశ్మీరులో పర్యటించినట్లు తెలిపారు. అయితే, జమ్ము, లడఖ్‌లో అభివృద్ధి పనులు జరిపే క్రమంలో తమ నాయకులు ఇబ్బందులు ఎదుర్కున్నారని చెప్పారు. కాగా, అమర్‌నాథ్ యాత్రకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సెర్చ్ ఆపరేషన్ నిలిపేశామని చెప్పారు. కశ్మీరు లోయలో 4,000 బంకర్లను నిర్మించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీంతో జమ్ముకశ్మీర్ మరోసారి రాష్ట్రపతి పాలన కిందకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. పీడీపీ అధికార ప్రతినిధి రఫి అహ్మద్ మీర్ మాట్లాడుతూ, బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని నడిపేందుకు తాము అన్ని విధాలా ప్రయత్నించామని… కానీ, అది జరగలేదని చెప్పారు. బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకోబోతోందని ఊహించలేకపోయామని అన్నారు. కాసేపట్లో ముఫ్తీ తన రాజీనామాను గవర్నర్ కు సమర్పించబోతున్నారని పీడీపీ మంత్రి నయీమ్ అఖ్తర్ తెలిపారు.