భారతీయ జనతా పార్టీ తీరు ఒక్కో సారి నవ్వులు పూయిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ పార్టీలో పక్క పక్కన కుర్చుని ప్రెస్ మీట్ లు పెట్టె నేతల మధ్య కూడా అవగాహనారాహిత్యం కనపడుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే ప్రధాన కార్యదర్శి, ఏపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న రామ్మాధవ్ ఇప్పుడు ఎన్నికల హామీల గురించి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడయితే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఏపీ బీజేపీ వ్యవహారాలను చూస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ ఆయన విభజన హామీల గురించి ఒక్క మాట మాట్లాడటం జరగలేదు. అయితే బీజేపీ తరపున పరోక్ష వ్యవహారాలను అంటే జనసేన వైసీపీల మధ్య మధ్యవతిత్వం లాంటివి చుస్తున్నారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. ఇలాంటి సమయంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆయన ఎన్నికల హామీల గురించి మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర బీజేపీ కార్యకర్తల సమావేశలో పాల్గొని ఎన్నికల కంటే ముందే రైల్వేజోన్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
రైల్వేజోన్ ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల డిమాండ్. అయితే నాలుగేళ్లుగా దీనిపై నాన్చినాన్చి..అనేక సార్లు సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులోనూ అఫిడవిట్ వేసింది. విశాఖ ఎంపీ, విశాఖ ఎమ్మెల్యేలను, బీజేపీ రైల్వేజోన్ ప్రధాన హామీగానే గెలుచుకుంది. తీరా అసలు సాధ్యం కాదని బుకాయించడం ప్రారంభించింది. ఓ సారి ఒడిషా అభ్యంతరం చెప్పిందని మరోసారి లాభదాయకం కాదని రకరకాల కారణాలు చెప్పింది. దీంతో.. టీడీపీ నేతలు.. తీవ్ర స్థాయిలో పోరాటం చేశారు. అయినప్పటికీ చలించలేదు. ఇప్పుడు హఠాత్తుగా రామ్మాధవ్.. ఉత్తరాంధ్ర కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఈ మాట చెప్పిన ఇదే రోజున రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ జోన్ అంశాన్ని రైల్వే మంత్రిత్వశాఖ పరిశీలిస్తోందని తెలిపారు. అంటే ఒకే రోజున మంత్త్రి ఒక మాట, ఆ పార్టీ నేత ఒక మాట మాట్లాడతారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు విషయంలో కేంద్రం పాతపాటే పాడుతోంది. పార్లమెంటులో ఎప్పుడు వీటిపై నిలదీసినా చూస్తున్నాం, చేస్తున్నాం అంటూనే నిర్లక్ష్యపూరిత సమాధానాలతో కాలం గడిపేస్తోంది. తాజాగా, విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై టీడీపీ సభ్యుడు శుక్రవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు పాతపాటే వల్లెవేసింది. జోన్ అంశాన్ని రైల్వే మంత్రిత్వశాఖ పరిశీలిస్తోందని తెలిపింది. రైల్వేజోన్ ఏర్పాటు తాజా పరిస్థితి తెలియజేయాలని ఎంపీ సుజనాచౌదరి అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వేజోన్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాల్సి ఉందని, సీనియర్ రైల్వే అధికారులతో ఓ కమిటీ నియమించామని పేర్కొన్నారు. ఏమిటో మరి ఈ మిధ్య భాజాపా నేతలకు అయినా అర్ధం అవుతుందో లేదో.