మెగా హీరోలు పవన్ వెనుకే…నేరుగా కాకున్నా…?

Allu Arjun Full Speech About Pawan Kalyan Controversy

రాజకీయాలకి సినిమా రంగానికి అదేదో విడదీయరాని సంబంధం ఉందనుకుంటా ఎందుకంటే నిర్మాతలుగా మారిన నాయకులూ, నేతలుగా మారిన దర్శక, నిర్మాత, నటులూ మనం ఎంతో మందిని చూశాం, అలాగే ప్రతిపార్టీకి సినీ గ్లామర్ అవసరమవుతూ ఉంటుంది. అలాంటిది పూర్తిగా సినీ గ్లామర్ తోనే ఏర్పాటయిన పవన్ ‘జనసేన’కు మద్దతుగా మెగా హీరోలు రంగంలోకి దిగుతున్నారా ? అంటే అవుననే అనిపిస్తోంది. కానీ మెగా హీరోలు ఎవరూ నేరుగా రాజకీయ ప్రసంగాలు చేయడం లేదు. సినిమా వేడుకలకు వచ్చినప్పుడు తమ ప్రసంగాల్లో రాజకీయాలను ప్రస్తావించకుండా వదలడం లేదు. పవన్ ‘జనసేన’కు మద్దతుగా మాట్లాడటమో లేదా పవన్‌ని విమ‌ర్శించేవారిపై సుత్తిమెత్తగా విరుచుకు పడటమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం గమనిస్తే తాగా ‘పడి పడి లేచె మనసు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దానికి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు. చంద్రబాబునాయుడు, కేసీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్ ఎవరినైనా ‘గారు’ అని సంభోదించాలని చెప్పారు. ఒకరికి గౌరవం ఇవ్వడం తప్పేం కాదన్నారు.

అల్లు అర్జున్ స్పీచ్ గమనిస్తే “రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రానా గౌరవం ఇవ్వకూడదని ఎవరూ హక్కు ఇవ్వలేదు” అన్నారు. చంద్రబాబునాయుడు, కేసీఆర్ ఎప్పట్నుంచో రాజకీయాల్లో ఉన్నారు. వారితో పోలిస్తే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినది పవన్ కల్యాణే. రాజకీయాల్లో విమర్శలు సహజం. పవన్‌ని ఎంతోమంది విమర్శిస్తున్నారు. కొందరు మాత్రం అసభ్య పదజాలంతో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అటువంటి వాళ్లకు బన్నీ కౌంటర్ ఇచ్చాడని మెగా టాక్. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘అంతరిక్షం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం రాత్రి జరిగింది. దీనికి మెగా ప‌వ‌ర్‌స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్‌ అతిథిగా వచ్చారు. అమెరికాలో పవన్ ప్రసంగం బావుందని చెప్పారు. వేదిక ముందున్న అభిమానులను ఉద్దేశిస్తూ రామ్ చరణ్ “మీరు వేదికకు అటువైపు ఉన్నారు కాబట్టి అరుస్తున్నారు. నేను ఇటువైపు ఉన్నాను కాబట్టి అరవలేకపోతున్నా, నాకూ మీలా అరవాలని ఉందని అన్నారు. పవన్ ఏం చెప్పారని కాదు… ఆయన మాటల్లో భావాన్ని ఆదర్శంగా తీసుకోవాలని రామ్ చరణ్ కోరారు. ఈ మొత్తం పరిణామాలను చూస్తుంటే మెగా హీరోలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగినా దిగకపోయినా ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా పవన్ కు అండగా నిలిచే అవకాశాలు కనపడుతున్నాయి.