Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భాజాపాలో ఉన్న కొన్ని కీలక అంశాలు విశ్లేషకులకి బలే నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అందులో ఒకటి ఏమిటంటే అస్సలు జనాదరణ లేని, ఎన్నికల్లో నిలబెడితే వార్డు మెంబర్ గా కూడా గెలవలేని కొందరు నేతలు ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగి అసలు పరిచయమే లేని కొందరు నేతలు పార్టీలో కీలక భూమిక పోషిస్తుంటారు. వారిలో జీవీఎల్, మురళీధరరావు, రాం మాధవ్ లాంటి వారు ఉన్నారు అసలు జనాల్లో పట్టే లేని వీరు బీజేపీలో పేరున్న నేతలకు సన్నిహితులన్న పేరు వినిపిస్తూ ఉంటుంది. వారిలో ఒకరయిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు నిన్న ఏపీలో చంద్రబాబు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
‘చంద్రబాబును ఓడించడం మామూలు విషయం కాదు. ఆయన్ని ఓడించడానికి ముందు చాలా శక్తులను ఓడించాలి. ఇంకా ఎన్నో ప్రణాళికలు వేయాల్సి ఉంది. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి కానివ్వకుండా చేయడమే మా ధ్యేయంమని మురళీధరరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసే పనిలో పడిందని కానీ బీజేపీ ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయ రంగంలోకి దిగలేదని, అయినా ఏ పరిణామాన్ని కూడా తేలికగా వదిలిపెట్టకుండా, తుది దాకా పోరాడే శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందని ఆయన అభిప్ర్రయపడ్డారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలను అంచనా వేయగలిగే అతికొద్ది మంది నేతల్లో చంద్రబాబు ఒకరని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబులాంటి బలమైన నేతను ఓడించేందుకు కొత్త పార్టీలు, వేదికలు ముందుకు వస్తాయని పేర్కొనడం ఇప్పుడు రాజకీయ వర్గాలో చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటపడుతుందని తాము ఊహించామని కానీ, తమ అంచనాలకు భిన్నంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా ఏడాదికి ముందే తమకు షాకిచ్చారని అన్నారు. రాజకీయంగా చూస్తే చంద్రబాబు చేసింది తప్పని తనకు అనిపించడం లేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ అస్తిత్వానికే ముప్పు ఉంటుందని… అందుకే, చంద్రబాబు తనదైన శైలిలో రాజకీయ క్రీడను మొదలు పెట్టారని మురళీధరరావు అన్నారు.
కేంద్రానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో విజయం సాధించాలన్న చంద్రబాబు వ్యూహం కచ్చితంగా నెరవేరుతుందని చెప్పలేమని మురళీధరరావు అభిప్రాయపడ్డారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత చిరంజీవి విఫలమయినట్టు, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విఫలమవుతారనే అంచనాలు వేయలేమని అప్పటికీ, ఇప్పటికీ రాజకీయ పరిస్థితులు మారిపోయాయని కానీ వివిధ వర్గాలను తనకు మద్దతుగా రప్పించుకోగల సమర్థతను పవన్ ప్రదర్శించాల్సి ఉందని అన్నారు. ఎన్టీయేలో ఉన్న పార్టీలు బయటకు పోవని, కొత్త పార్టీలు కూడా వచ్చి చేరుతాయని దీంతో మేమింకా బలపడుతామని తెలిపారు.