Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయం కోసం ఎంతకైనా దిగజారితే పరిస్థితి ఎలా ఉంటుందో రాజ్యసభ ఎన్నికల్లో తెలిసొచ్చింది బీజేపీకి. నరేంద్ర మోడీ తరచుగా ప్రవచించే విలువలకు విరుద్ధంగా రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్.. కాషాయ పార్టీకి తలబొప్పి కట్టించింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని విజయవంతంగా తమవైపు తిప్పుకున్నా.. వాళ్లు ఓట్లు చూపించి వేయడం బీజేపీ కొంప ముంచింది.
వీడియో సాక్ష్యం లేదని వాదించిన కమలనాథులు.. చివరకు ఈసీ నిర్ణయానికి తలవంచక తప్పలేదు. మ్యాజిక్ ఫిగర్ ఓట్లతో అహ్మద్ పటేల్ బయటపడగా.. దేనికోసమైతే ఇంత రాజకీయం నడిపారో.. ఆ లక్ష్యం మాత్రం నెరవేర్చుకోలేకపోయారు అమిత్ షా. అహ్మద్ పటేల్ మాత్రం తన జీవితంలో ఎప్పుడూ పడనంత ఒత్తిడి అనుభవించారనేది వాస్తవం. దీనికి తోడు బీహార్లో బీజేపీతో పొత్తుతో ప్రభుత్వం నడుపుతున్న నితీష్.. కీలక సమయాల్లో మాత్రం హ్యాండిస్తున్నారు. దీంతో ఆయన్ను మిత్రుడిగా పరిగణించలేని పరిస్థితి బీజేపీది.
కానీ అంతా అనుకూలంగా ఉన్న సమయంలో కూడా అహ్మద్ పటేల్ ను ఓడించలేకపోవడమపై బీజేపీలో అంతర్మథనం జరుగుతోంది. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చివరిదాకా ఊపు తీసుకొచ్చి.. ఆఖర్లో తుస్సుమంటారా అని సీఎం విజయ్ రూపానీని అమిత్ షా ప్రశ్నించారట. ఢిల్లీ నుంచి వచ్చి మేం ఇంత చేస్తే.. గాంధీనగర్లో కూర్చుని మీరేం చేశారని ప్రశ్నించడంతో రూపానీ దగ్గర ఆన్సర్ లేదట. జేడీయూ ఎమ్మెల్యే అహ్మద్ పటేల్ కు ఓటేయడం బీజేపీకి ఇంకా మింగుడు పడటం లేదు.