హైదరాబాద్‌లోని జుమ్మెరాత్ బజార్లో అర్ధరాత్రి పోలీసులు లాఠీచార్జ్ చేశారని, తనను గాయపరిచారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల లాఠీచార్జ్ చేయడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ గాయపడ్డారంటూ ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. కానీ, రాజాసింగ్ స్వయంగా రాయితో కొట్టుకుని గాయపరుచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు వీడియో ఆధారాన్ని కూడా పోలీసులు విడుదల చేశారు. తాజాగా బయటికొచ్చిన వీడియో ప్రకారం.. పోలీసులు అడ్డుకుంటున్నా రాజాసింగ్ మాత్రం పెద్ద రాయిని రెండు చేతులతో పైకిలేపి ఒక్కసారిగా తలపై కొట్టుకున్నారు. దీంతో ఆయన తలకు గాయమైంది. స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతిబాయి లోధి విగ్రహాన్ని పోలీసుల అనుమతి లేకుండా అర్ధరాత్రి జుమ్మెరాత్ బజార్ చౌక్ వద్ద పున:ప్రతిష్ఠ చేయడానికి రాజాసింగ్, ఆయన అనుచరులు ప్రయత్నించడంతో ఈ ఘర్షణ జరిగింది. విగ్రహ పున:ప్రతిష్ఠను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచర వర్గం విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రయత్నించింది. దీంతో పోలీసులకు, ఆ వర్గానికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎట్టిపరిస్థితుల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీల్లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన రాజాసింగ్ రాయితో తలపై కొట్టుకున్నారు. గాయపడిన రాజాసింగ్‌ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అవుట్ పేషెంట్ వర్డ్ వారితో పోలీసులు లాఠీచార్జ్ చేయడం వల్ల తాను గాయపడ్డానని రాజాసింగ్ పేర్కొన్నారు.