Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ఉన్నావ్ అత్యాచార కేసు చిక్కుముడి వీడింది. ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగారే ప్రధాన నిందితుడని కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ తేల్చింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఆమె దుస్తులు, ఇతర వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షించి ఇచ్చిన నివేదిక ఆధారంగా సెంగారే ప్రధాననిందితుడని సీబీఐ నిర్ధారణకు వచ్చింది. బాధితురాలిపై అత్యాచారం, తదనంతర పరిణామాలు గమనిస్తే… సెంగార్ సినిమా విలన్లను తలదన్నేలా అత్యంత క్రూరంగా వ్యవహరించినట్టు అర్ధమవుతుంది. గత ఏడాది జూన్ 4న సెంగార్ తనపై అత్యాచారం జరిపాడని 16ఏళ్ల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. అయితే సెంగార్ కు స్థానికంగా ఉన్న పలుకుబడి కారణంగా పోలీసులు కేసు నమోదుచేయడంలో తీవ్ర తాత్సారం చేశారు. న్యాయం కోసం బాధితురాలు పలుసార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా ఫలితం లేకుండాపోయింది.
గత నెల మూడోతేదీన ఫిర్యాదుచేయడానికి మరోమారు బాధితురాలి తండ్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లగా… సెంగార్ సోదరుడు ఆయనపై దాడిచేశారు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబసభ్యులకు, సెంగార్ బంధువులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు అసలు కేసును పక్కకుబెట్టి… గొడవకు సంబంధించి బాధితురాలి తండ్రిపై కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో గత నెల 8న బాధితురాలు కుటుంబంతో సహా యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఇంటిముందు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఉన్నావ్ దారుణం వెలుగుచూసింది. అదే సమయంలో బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించడం… తీవ్ర సంచలనం సృష్టించింది. సెంగార్ సోదరుడు, పోలీసులు కొట్టిన దెబ్బలకే బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో మరణించినట్టు తెలిసింది.
ఉన్నావ్ ఘటన వెలుగుచూసిన తర్వాత కూడా వెంటనే నిందితుని అరెస్ట్ జరగలేదు. దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో యూపీ ప్రభుత్వం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు సెంగార్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. బాధితురాలి దుస్తులు, ఇతర వస్తువులను పరీక్షించి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదికలు ల్యాబ్ నుంచి రాకుండా చేయడానికి ఎమ్మెల్యే అనుచరులు తీవ్రంగా ప్రయత్నించినట్టు తేలింది. కేసుపై నమోదుచేసిన ఎఫ్ ఐఆర్ లోనూ ఎమ్మెల్యే పేరు లేకుండా స్థానిక పోలీసులను ఎమ్మెల్యే అనుచరులు ప్రలోభ పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి సినిమాల్లోలా అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో చివరకు సెంగారే అసలు విలన్ అని సీబీఐ నిర్దారించడం… బాధితురాలికి పెద్ద ఊరట.