టీడీపీ, బీజేపీ పొత్తు క్లయిమాక్స్ కు చేరిన వేళ… బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల నేతల మధ్య ప్రత్యక్ష మాటలయుద్ధం కొనసాగుతున్న తరుణంలో విష్ణుకుమార్ రాజు మాత్రం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు దక్కిన వరం చంద్రబాబునాయుడని విష్ణుకుమార్ రాజు ప్రశంసించారు. హుద్ హుద్ తుపాను అనంతరం విశాఖను సుందరంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు. ముఖ్యమంత్రిగా, సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయనేతగా చంద్రబాబుపై తనకు అపారమైన గౌరవం, అభిమానం ఉన్నాయని తెలిపారు. 2022 నాటికి దేశంలోనే ఏపీని మొదటిస్థానంలో నిలపడానికి చంద్రబాబు చేస్తున్న కృషి ఫలిస్తుందన్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగాల్సిందేనని, రాష్ట్రప్రయోజనాల కోసం రాజకీయాలకతీతంగా అందరం కృషిచేయాలని సూచించారు.
న్యాయంప్రకారం రాష్ట్రానికి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీ, టీడీపీపైనే ఉందని, ఏపీప్రజల మనోనభావాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఏపీకి అన్యాయం జరుగుతోంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలతోపాటు మరెన్నో ప్రాజెక్టులు, సంస్థలను కేంద్రం ఏర్పాటుచేస్తోందని విష్ణుకుమార్ రాజు చెప్పారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం పేర్కొనలేదని, రాజ్యసభలో వెంకయ్యనాయుడు డిమాండ్ చేసిన తర్వాతే చట్టంలో పొందుపర్చారని గుర్తుచేశారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, కేంద్రం చెబుతోందని, దీనికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి సిద్దంగా ఉందని చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని తన భార్యే తనను ప్రశ్నిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, బీజేపీ సహకరించుకోవాల్సిన అవసరం ఉందని, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ వచ్చితీరుతుందని, దీనిలో ఎలాంటి సందేహం లేదని విశాఖ, అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్టులు, కడప స్టీల్ ప్లాంట్ పూర్తిచేసి తీరుతామని, బీజేపీ ఆంధ్రులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వదని విష్ణుకుమార్ రాజు హామీఇచ్చారు. విష్ణుకుమార్ రాజు ప్రసంగం సందర్బంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విష్ణు మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులెవరూ స్పందించలేదు. దీంతో ఆయన… చంద్రబాబు గురించి పొగుడుతున్నా… ఎవరూ చప్పట్లు కొట్టడంలేదని, తనపై ఎందుకింత వివక్షని సరదాగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నుంచి… చంద్రబాబును విష్ణుకుమార్ రాజు పొగిడినప్పుడల్లా టీడీపీ సభ్యులు చప్పట్లు కొట్టారు. ఈ పరిణామాలు చూసిన వారికి… రెండు పార్టీల మధ్య మళ్లీ సుహృద్భావ వాతావరణం ఏర్పడుతోందా అన్న సందేహం కలిగింది.