శ్రీరాముడికి కూడా ఓ ఇల్లు ఇవ్వండి…బీజేపీ నేత వినూత్న నిరసన !

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై డిమాండ్ పెరుగుతోంది. రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నందున దీనిపై ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోబోమని కేంద్రం చెబుతూ వస్తోంది. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌, శివసేన మాత్రం రామ మందిర నిర్మాణం కోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాలంటూ బీజేపీపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఆర్డినెన్స్ తీసుకొచ్చి రామమందిరాన్ని నిర్మించాలని హిందూ సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంటే సుప్రీం కోర్టు తీర్పు వచ్చేవరకూ ఆగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇటీవల జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ఎంపీలు ఈ డిమాండ్‌ను లేవనెత్తారు. అయితే బీజేపీ ఎంపీ ఒకరు ఇప్పుడు ఇదే డిమాండ్ ను కాస్త వినూత్నంగా తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంపీ హరి నారాయణ రాజ్‌భర్ ‘రాముడికి కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదని, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద ఓ ఇల్లు కేటాయించాలని’ కోరుతూ అయోధ్య జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ‘రాముడు ప్రస్తుతం టెంట్‌లో ఉంటున్నాడని ఎండ, వాన, చలి నుంచి కాపాడేందుకు కనీసం పైకప్పు కూడా లేదని ఇల్లు లేని వారికి నివాసం కల్పించడం కేంద్రప్రభుత్వం బాధ్యత కదా అందుకే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద జిల్లా అధికారులు రాముడికి ఇల్లు కేటాయించాలి’ అని రాజ్‌భర్‌ లేఖలో పేర్కొన్నారు.