గుజ‌రాత్ నేర్పిన పాఠాలు

Bjp Party set to win Gujarat elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గుజ‌రాత్… దేశంలోని అన్ని రాష్ట్రాల్లాంటిది కాదు. మ‌త‌మౌఢ్యం, అభివృద్ధి స‌మాంత‌రంగా ఉండే రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. వెన‌క‌బ‌డిన రాష్ట్రం స్థాయి నుంచి దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం స్థాయికి ఎదిగింది. భార‌త దేశం ప్ర‌స్తుత‌ స్థితికి కార‌ణం ఒక ర‌కంగా గుజ‌రాత్ అనే చెప్పొచ్చు. ప్ర‌జాస్వామ్యంలో ఏదైనా సాధ్య‌మ‌నే దానికి గుజ‌రాత్ అస‌లు సిస‌లు ఉదాహ‌ర‌ణ‌. నరేంద్ర‌మోడీ లాంటి వ్య‌క్తిని దేశానికి అందించింది. బ‌ల‌హీన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీజేపీకి జాతీయ‌స్థాయిలో తిరుగులేని అధికారం క‌ట్ట‌బెట్టింది. అందుకే గుజ‌రాత్ ఎన్నిక‌లను దేశంలో ఓ రాష్ట్రంలో సాధార‌ణంగా ఐదేళ్ల‌కోసారి జ‌రిగే ఎన్నిక‌ల్లా ప‌రిగ‌ణించ‌లేం… ఎవ‌రు ఔన‌న్నా… కాద‌న్నా గుజ‌రాత్ తీర్పు… 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వ‌చ్చే తీర్పుకు ముంద‌స్తు అంచ‌నానే. అందుకే అధికార బీజేపీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ గుజ‌రాత్ ఎన్నిక‌ల‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.

narendra-modi-about-gujarat

ప్ర‌ధాని ప‌ద‌వి విశ్వ‌రూపం చూపిస్తున్న మోడీని దెబ్బ‌తీయ‌టానికి కాంగ్రెస్ గుజ‌రాత్ ఎన్నిక‌ల‌నే ఆయుధంగా మార్చుకుంది. మోడీని మూలాల నుంచి దెబ్బ‌కొట్టాలంటే స్వ‌రాష్ట్రం నుంచే ఆయ‌న‌కు పాఠాలు చెప్పాల‌ని నిర్ణ‌యించుకుంది. తల్లి చాటు నుంచి కాంగ్రెస్ ను, త‌న‌ను కూడా బ‌య‌ట‌కు తెచ్చుకున్న కొత్త అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కేవ‌లం త‌న సొంత తెలివితేట‌ల మీద ఆధార‌ప‌డే గుజ‌రాత్ ఎన్నికల ప్ర‌చార బ‌రిలోకి దిగారు. రాహుల్ కు జాతీయ మీడియాలో మ‌ద్ద‌తు ఎక్కువ‌. అదే స‌మ‌యంలో మోడీకి ఆ మీడియా నుంచి వ్య‌తిరేక‌తా ఎక్కువే. సోష‌ల్ మీడియాను, కొన్ని చాన‌ళ్ల‌ను మేనేజ్ చేస్తూ…  ప్ర‌ధాని పై చేయి సాధించిన‌ట్టు క‌నిపిస్తూ ఉంటారు కానీ… కొన్ని సంద‌ర్బాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆయ‌న ప‌రిధిని దాటి ప్ర‌వ‌ర్తిస్తూ ఉంటుంది. గుజ‌రాత్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డగానే.. ఈ సారి ఆ రాష్ట్రంలో బీజేపీ గెల‌వ‌లేద‌ని, కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశ‌ముందంటూ ప్ర‌చారం జ‌ర‌గ‌డం ఇందులో భాగ‌మే. జీఎస్టీ, పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాలు కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకుని చాలా కాల‌మే అయింది. కానీ గుజ‌రాత్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే వాటిపై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది. ఆ కీల‌క నిర్ణ‌యాల ప్ర‌భావం దేశ‌ప్ర‌జ‌లు ఇప్పుడే తెలుసుకుంటున్నార‌ని, కేంద్రప్ర‌భుత్వంపై దేశ‌మంతా తీవ్ర వ్య‌తిరేక‌తో ఉంద‌నీ పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా సాగింది. స‌రిగ్గా చెప్పాలంటే బీజేపీ గుజ‌రాత్ లో గెలిచే ప‌రిస్థితే లేద‌న్న‌ట్టుగా విశ్లేష‌ణ‌లు వెలువ‌డ్డాయి.

modi

ఇదంతా మోడీ వ్య‌తిరేక మీడియా ప్ర‌చారం వ‌ల్లే. నిజానికి గుజ‌రాత్ లో కాంగ్రెస్ బ‌లం ఏమిటో, ఆ పార్టీ స‌త్తా ఏమిటో దేశ‌మంతా తెలుసు. అందుకే కాంగ్రెస్ కు అనుకూలంగా మ‌రీ ఎక్కువ‌గా అస‌త్య ప్ర‌చారం చేయ‌లేక‌పోయింది మీడియా. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్, ప్ర‌చారం తొలిరోజుల్లో బీజేపీకి బాగా వ్య‌తిరేక‌త ఉందంటూ సాగిన ప్రచారం నెమ్మ‌దినెమ్మ‌దిగా త‌గ్గుతూ వ‌చ్చింది. వాస్త‌వ ప‌రిస్థితిని అర్ధం చేసుకున్న కాంగ్రెస్ అనుకూల మీడియా.. చివ‌ర‌కు హ‌స్తం పార్టీ గెల‌వ‌బోతోంద‌న్న ప్ర‌చారాన్ని ఆపేశాయి. అయితే మీడియా సంగ‌తి ప‌క్క‌న పెడితే ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ బ‌ల‌ప‌డిన మాట మాత్రం నిజం. రెండు ద‌శాబ్దాల‌కు పైగా అధికారంలో ఉన్న పార్టీకి స‌హ‌జంగా ఉండే వ్య‌తిరేక‌త‌కు తోడు రాహుల్ గాంధీ ప్ర‌చారం కాంగ్రెస్ కు లాభించాయి. కేంద్ర ప్ర‌భుత్వ ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు కూడా కొంత‌మేర ప్ర‌భావం చూపాయి. ఈ విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని మోడీ, అమిత్ షా లు కొన్ని త‌ప్పుల నుంచి గుణ‌పాఠాలు నేర్చుకుంటే 2019 ఎన్నిక‌ల్లో గెలుపు బీజేపీకి న‌ల్లేరు మీద న‌డ‌కే అవుతుంది. అటు రాహుల్ గాంధీ కూడా జాతీయ‌స్థాయిలో అధికారంలోకి రావాలంటే నరేంద్ర మోడీ త‌ప్పుల్ని ఎత్తిచూప‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకోకుండా… కాంగ్రెస్ కొత్త సార‌ధిగా దేశానికి తానేం చేయ‌గ‌ల‌నో ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌య్యే రీతిలో వివ‌రించగ‌ల‌గాలి. అప్పుడే గుజ‌రాత్ ఫ‌లితం సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పున‌రావృతం కాకుండా ఉంటుంది.