Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయటెత్తులు ఎంత లోతుగా వుంటాయో ఇప్పుడు జగన్ కోసం బీజేపీ వేస్తున్న పాచిక చూస్తే అర్ధం అవుతుంది. ఆ పాచిక పరమార్ధం తెలియని జగన్ బీజేపీ తన కోసం చాటుగా కన్ను గీయడాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తనని అవినీతి కేసుల నుంచి బయటపడేయడం తో పాటు చంద్రబాబుకి షాక్ ఇస్తారని బీజేపీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు జగన్. పైగా మోడీ ప్రభ తో వచ్చే ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టవచ్చని కూడా జగన్ కల కంటున్నారు. టీడీపీ తో రాజకీయ కాపురం చేస్తూనే వైసీపీ కి కన్నుకొడుతున్న బీజేపీ వైఖరి చూస్తున్న వారికి కూడా జగన్ అలా ఆశ పడడంలో తప్పు లేదేమో అనిపిస్తోంది. కానీ కమలనాధుల మాస్టర్ ప్లాన్ బయటికి తెలిస్తే జగన్ కి మైండ్ బ్లాక్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇంతకీ బీజేపీ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ తెలిస్తే ఒక్క జగన్ మాత్రమే మొత్తం తెలుగు రాజకీయ రంగమే నివ్వెరపోతుంది.
మోడీ, అమిత్ షా ద్వయం హవా మొదలు అయ్యాక బీజేపీ రాజ్యకాంక్ష పెరిగింది. కొత్త కొత్త రాష్ట్రాల్లో కూడా పాగా వేయడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఉత్తరాది విషయం పక్కనబెడితే దక్షిణాదిన ఆ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం లేదు. ఈ విషయంలో ఒక్క కర్ణాటక మాత్రమే కొంత మినహాయింపు. కర్ణాటక తర్వాత బీజేపీ కి కొద్దోగొప్పో బలమున్న రాష్ట్రం తెలంగాణ. కానీ బీజేపీ తెలంగాణాని పట్టించుకోకుండా ఏపీ లో బాబు గుండెల్లో చిచ్చు పెడుతూ జగన్ కి కన్ను కొడుతోంది. అది చూసి చిన్న పిల్లాడిలా చంకలు గుద్దుకుంటున్న జగన్ కి అసలు విషయం తెలిస్తే షాక్ అవుతాడు. తెలంగాణాలో తెరాస కి పోటీ ఇచ్చే స్థితిలో వుంది కాంగ్రెస్ మాత్రమే. తెరాస ని కొట్టాలంటే ముందుగా కాంగ్రెస్ స్థానంలోకి రావాలన్న క్లారిటీ వచ్చింది బీజేపీకి. ఆ కోణంలోనే కాంగ్రెస్ కొమ్ముకాస్తున్న రెడ్ల మీద బీజేపీ కన్ను పడింది. 10 జనపథ్ సత్తా మీద డౌట్ పడుతున్న రెడ్లు కాంగ్రెస్ లోను అంతంత మాత్రం యాక్టివ్ గానే వున్నారు. అలాంటి వారిని ఆకట్టుకోడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. వారు సుముఖంగానే ఉన్నప్పటికీ రెడ్లకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి నాయకుడు ఉంటే బాగుంటుందని తెలంగాణ రెడ్డి నేతలు బీజేపీ హైకమాండ్ కి సూచించారట.
ఆ సలహా, సూచనకి అనుగుణంగానే బీజేపీ కొత్త మాస్టర్ ప్లాన్ కి శ్రీకారం చుట్టింది. జగన్ కి వున్న రెడ్డి బ్రాండ్ ఉపయోగించడానికి ప్లాన్ రెడీ అయ్యింది. ఒక్కసారి జగన్ ని ముగ్గులోకి లాగితే ఏపీ లో ఫలితం వచ్చినా, రాకున్నా తెలంగాణాలో బీజేపీ, వైసీపీ కలిసి పోటీ చేస్తే రెడ్లంతా తమ వైపు వస్తారని కమలనాధుల ఆలోచన. అదే ఆలోచన అమల్లో పెట్టి జగన్ చేతిలో రెడ్డి బాణం వుపయోగించి కెసిఆర్ ని పడగొట్టాలని బీజేపీ ట్రై చేస్తోంది. ఇదేమీ ఆలోచించకుండా బీజేపీ తో పొత్తుకు జగన్ తహతహలాడుతుంటే, చంద్రబాబు మీద కోపంతో జగన్ గెలవాలని కెసిఆర్ కోరుకుంటున్నారు. వాళ్ళ అమాయకత్వంతో ఆటలాడుకుంటున్న బీజేపీ ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొట్టాలనుకుంటోంది.
మరిన్ని వార్తలు: