Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీకి భంగపాటు తప్పేట్టులేదు. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి విస్తృతంగా ప్రచారం నిర్వహించినప్పటికీ గుజరాత్ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గినట్టు కనిపించడం లేదు. 22 ఏళ్ల నుంచి రాష్ట్రంలో వరుసగా అధికారంలో ఉంటున్నా… బీజేపీపై గుజరాతీలకు వ్యతిరేకత పెరిగినట్టు లేదు. కేంద్రప్రభుత్వ కీలక నిర్ణయాలు పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు కూడా గుజరాతీలపై ప్రభావం చూపలేకపోయాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తేలింది. గుజరాత్ లో రెండో విడత పోలింగ్ ముగిసిన కాసేపటికే విడుదలయిన ఎగ్జిట్ పోల్స్ ఈ సారీ అధికారాన్ని బీజేపీకే కట్టబెట్టాయి. మోడీ చరిష్మా, రాష్ట్ర అభివృద్ధి అంశాలు ఓటర్లను బీజేపీవైపే నిలిచేటట్టు చేశాయి.
మొత్తం గుజరాత్ లో 182 అసెంబ్లీ స్థానాలుండగా… ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు కావాలి. జాతీయ చానళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో బీజేపీదే విజయమని వెల్లడయింది. ఎక్కువ చానళ్లు బీజేపీ వందకు పైగా స్థానాలు గెలుస్తోందని వెల్లడించాయి. కాంగ్రెస్ కు 70 నుంచి 80 స్థానాలు వస్తాయని తెలిపాయి. అటు హిమాచల్ ప్రదేశ్ లోనూ బీజేపీనే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తేలింది. హిమాచల్ లో మొత్తం 68 స్థానాలు ఉండగా… బీజేపీ 50కి పైగా సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేయనుందని వెల్లడయింది.