Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని సాగుతున్న ప్రచారం రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే ఈవో సూర్యకుమారి తాంత్రిక పూజలు జరగలేదని స్పష్టంచేసినా వివాదం చల్లారలేదు. డిసెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి దుర్గగుడిలోకి ఓ అజ్ఞాత వ్యక్తి ప్రవేశించి తాంత్రిక పూజలు జరిపారని వచ్చిన ఆరోపణల్ని ఆమె ఖండించారు. దుర్గగుడిపై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ప్రధానార్చకుడు అంతరాలయాన్ని శుభ్రం చేసేందుకు ఓ వ్యక్తిని సహాయకునిగా తెచ్చుకున్నారని, దీన్ని సాకుగా తీసుకుని కొందరు తాంత్రికపూజలంటూ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. అటు ప్రధానార్చకులు బద్రీనాథ్ బాబు కూడా దీనిపై స్పందించారు.
మరుసటిరోజు ఉదయానికి గుర్భగుడిని సిద్ధం చేయాలన్న తొందరలోనే తనకు సహాయకుడిగా ఓ వ్యక్తిని తెచ్చుకున్నానని, ఇతర పూజలేవీ నిర్వహించలేదని తెలిపారు. తనకు సహాయంగా వచ్చిన వ్యక్తి కూడా కృష్ణాజిల్లాలోని ఓ ఆలయంలో అర్చకుడిగా ఉన్నారని, దేవాదాయ శాఖ నుంచి వేతనం తీసుకుంటున్నారని చెప్పారు. ఈవో, ప్రధానార్చకులు ఇలా చెప్తోంటే వైసీపీ మాత్రం ఈ వివాదానికి రాజకీయ రంగు పులిమింది. ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్ ను సీఎం చేసేందుకు దుర్గగుడిలో తాంత్రిక పూజలు నిర్వహించారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. తాంత్రిక పూజల వెనక చంద్రబాబు ఉన్నారని, పూజ చేస్తూ దొరికిపోయిన తర్వాత ఆ తప్పును అధికారులపై నెట్టేయడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. జనవరి 1 సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఏ దేవాలయంలోనూ ప్రత్యేక పూజలు జరగలేదని, అదే సమయంలో చంద్రబాబు కుటుంబాన్ని మాత్రం వేదపండితులు ఆశీర్వదించారని విమర్శించారు.