Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీదేవి మృతిచెంది వారం రోజులయింది. ఆమె హఠాన్మరణం, ఆ తర్వాత ఆ మరణంపై తలెత్తిన సందేహాలు….శ్రీదేవి అంత్యక్రియలకు సంబంధించిన వార్తలన్నీ ఆగిపోయాయి….ఆమె మరణవార్తవిని తీవ్రంగా కలత చెందిన అభిమానులంతా తమ రొటీన్ లో పడిపోయారు. అయినప్పటికీ..శ్రీదేవి మరణానికి ముందు ఏంజరిగిందన్నదీ…ఇప్పటికీ అందరికీ సందేహంగానే ఉంది. దీనిపై తన స్నేహితుడు, సినీ విశ్లేషకుడు కోమల్ నహతాతో ఆవేదనను పంచుకున్నాడు శ్రీదేవి భర్త బోనీకపూర్. బోనీ చెప్పిన విషయాలన్నింటినీ కోమల్ తన బ్లాగ్ లో రాశారు. బోనీ చెప్పిన వివరాలిలా ఉన్నాయి…దుబాయ్ కి ప్లాన్ చేసుకుని వెళ్లలేదు. మోహిత్ పెళ్లయ్యాక జాన్వికి దుస్తులు కొనడానికి శ్రీదేవి కొన్నిరోజులు దుబాయ్ లోనే ఉంటానంది. దాంతో నాకు లక్నోలో పనుండడంతో భారత్ వచ్చేశాను.
ఫిబ్రవరి 24న ఉదయం శ్రీదేవి నాకు ఫోన్ చేసింది. నన్ను చాలా మిస్సవుతున్నానని చెప్పింది. అయితే శ్రీదేవికి సర్ ప్రయిజ్ ఇద్దామన్న ఉద్దేశంతో సాయంత్రం దుబాయ్ వస్తున్న సంగతి నేను తనతో చెప్పలేదు. శ్రీదేవికి ఒంటరిగా ఉండడం అలవాటు లేదు. అందుకే తొందరగా దుబాయ్ కి బయలుదేరు డాడీ అని జాన్వీ నాకు చెప్పింది. ఫిబ్రవరి 24న సాయంత్రం 6.20 గంటల సమయంలో దుబాయ్ వెళ్లాను. శ్రీదేవికి సర్ ప్రయిజ్ ఇద్దామనుకుని నా లగేజీని కాస్త లేట్ గా గదిలో పెట్టమని బెల్ బాయ్ కు చెప్పాను. నా వద్ద ఉన్న డూప్లికేట్ తాళం చెవితో గది తలుపు తీశాను. శ్రీదేవి నన్ను చూసిన సంతోషంతో ఆలింగనం చేసుకుంది. నేను దుబాయ్ వచ్చి తనను సర్ ప్రయిజ్ చేస్తానని ముందే ఊహించానంది. అరగంటపాటు ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి డిన్నర్ కు వెళ్లాలనుకున్నాం. శ్రీదేవి స్నానం చేసి వస్తానంది. నేను హోటల్ లివింగ్ రూమ్ లో ఉంటానని చెప్పా. టీవీ చూస్తూ కూచున్నా. కానీ ఎంతసేపటికీ గది నుంచి బయటకు రాలేదు. దీంతో నేను గదిలోకి వెళ్లాను. ఆమె అక్కడ లేదు. ఇంకా బాత్రూమ్ నుంచి బయటకు రాలేదని అర్ధమయింది. పలుమార్లు తలుపు కొట్టి చూశాను. పలకలేదు. బాత్రూమ్ గడియ పెట్టిలేదు. దాంతో లోపలికి వెళ్లాను. అక్కడ శ్రీదేవి నిండా నీళ్లు ఉన్న బాత్ టబ్ లో మునిగిపోయిఉంది. అది చూసి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది….అని బోనీ… నహతాతో తన ఆవేదన పంచుకున్నాడు. అటు శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కూడా తండ్రికి మద్దతుగా ఓ లేఖ రాసింది. శ్రీదేవి వివాదాస్పదమరణం విషయంలో బోనీకపూర్ పై అనుమానమొచ్చేట్టుగా మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో జాన్వీ తల్లిదండ్రుల అనుబంధం గురించి ప్రస్తావించింది. శ్రీదేవి, బోనీకపూర్ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, వారి మధ్య ఉన్న బంధాన్ని అపహాస్యం చేయొద్దని వేడుకుంది. ప్రతి ఒక్కరూ వారి వారి తల్లిదండ్రులను ప్రేమించాలని, తన తల్లి ఆత్మ శాంతికోసం ప్రార్థించాలని, అదే తనకు అభిమానులిచ్చే పుట్టినరోజు బహుమానమని చెప్పింది. తన తల్లిదండ్రులు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న అన్యోన్యమైన జంటని, వారు ప్రేమించుకున్నారని, వారి ప్రేమను కించపరచవద్దని, వారి బంధాన్ని గౌరవించాలని కోరింది. తాను, ఖుషి తల్లిని కోల్పోతే…తమ తండ్రి సర్వస్వాన్నే పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తంచేసింది. తామిద్దరికీ తల్లిగా, తండ్రికి సహచరిగా శ్రీదేవి తన పాత్రను సమర్థవంతంగా పోషించిందని వెల్లడించింది.