చంద్రబాబుకు బెయిల్పై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుకు బెయిల్పై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు పదేపదే ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించిందని…పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించిందని ఏపీ సర్కార్ స్పష్టం చేస్తోంది.
హైకోర్టు తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసిందని…కేసు మెరిట్స్ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాలదర్యాప్తులో లోపాల గురించి బెయిల్ పిటిషన్ సమయంలోనే వ్యాఖ్యానించిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారని..ఇలాంటి సమయంలో బెయిల్ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
సీడీఐ కోరిన సమాచారాన్ని ఇప్పటి వరకూ టీడీపీ ఇవ్వనే లేదని..కేసు మూలాల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్ కోర్టు అధికారాలను హరించడమేనని పేర్కొంది. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని..దర్యాప్తు సమయంలో బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు తీరు అనూహ్యమైనదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.