Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కొత్త మీడియా సంస్థలు ఉధృతంగా పుట్టుకొస్తున్నాయి. ఓ వైపు ఇప్పటికే నడుస్తున్న న్యూస్ ఛానెల్స్ లో దాదాపు 80 శాతం నష్టాల్లో వున్నాయి. వాటిని వదిలించుకోవడం ఎలాగో తెలియక కొందరు, పరువు కోసం ఇంకొందరు ఆ బరువు అలాగే మోస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా దాదాపు 10 కొత్త న్యూస్ ఛానెల్స్ తెలుగు ప్రజలకి అందుబాటులోకి వస్తున్నాయి. నష్టం అని తెలిసి కూడా మీడియా వ్యాపారంలోకి ఎందుకు వస్తున్నారు అని చిన్నపాటి సర్వే చేసినప్పుడు ఆసక్తికర అంశాలు తెలిసాయి.
తెలుగులో కొత్తగా వస్తున్న న్యూస్ ఛానెల్స్ అన్నీ 2019 ఎన్నికల దృష్టితోనే వస్తున్నాయి. వీటికి సారధ్యం వహించే వారిలో ఎక్కువ మంది వ్యాపారులు ఏదో ఒక రంగంలో డబ్బు సంపాదించి ఇక్కడ పోగొట్టుకోడానికి సిద్ధపడ్డ వాళ్ళే. ఓ ఛానల్ ఉండటం అనేది గౌరవప్రదం అని వీళ్ళ ఆలోచన. పైగా తమకు నచ్చిన పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినట్టు చెప్పుకోవచ్చు. రేపు ప్రభుత్వం వస్తే ఏదైనా పని అడగొచ్చు లేకున్నా కనీసం ఛానల్ ఓనర్ గా సోషల్ స్టేటస్ ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువమంది ఈ కోవలో వున్న వాళ్ళే. ఛానల్ గురించి ఎంక్వయిరీ చేస్తుండగా ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇది లాభదాయక వ్యాపారం కాదని ఓ బిజినెస్ మ్యాన్ ని హెచ్చరించాడు. అందుకు బదులుగా ఆ బిజినెస్ మ్యాన్ ఆ విషయం తెలుసనీ, ఓ 20 కోట్లు నష్టపోడానికి సిద్ధం అని ఓ క్షణం కూడా ఆలోచించకుండా చెప్పాడు.
ఇక ఇబ్బడిముబ్బడిగా వస్తున్న ఛానెల్స్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో నామమాత్రమే అవుతుంది. అయినా పట్టించుకోకుండా లేనిపోని ఆశతో జర్నలిజం రంగంలో కొందరు తమకు తెలిసిన వ్యాపారుల్ని మీడియా ముగ్గులోకి దించుతున్నారు. ఓ ఫెయిల్యూర్ ఛానల్ కొత్త సారధ్యంలో బయటికి రావడానికి ఇదే కారణం. ఏదేమైనా ఈ పరిణామాలతో కొన్నాళ్లుగా ఉద్యోగాలు పోవడమే చూస్తున్న జర్నలిస్టులకి కాస్త ఊరట. ఈ ఎంజాయ్ మెంట్ కూడా వచ్చే ఎన్నికల దాకా ఉంటుందన్నది మాత్రం చేదు వాస్తవం.