తెదేపా అధినేత చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని ఆ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. చంద్రబాబు దాదాపు మూణ్నెల్ల విరామం తర్వాత బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కుప్పం నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో వైకాపా ప్రభుత్వ అరాచకాల వల్ల అశాంతి, హింసా సంస్కృతి మొదలయ్యాయని, రాజకీయ వేధింపులు పెచ్చు మీరాయని చంద్రబాబు మండిపడ్డారు. ‘నన్ను ఇబ్బంది పెట్టేందుకు, పార్టీ నాయకుల్ని భయపెట్టేందుకు జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలపై కూడా అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపింది. కానీ వారు ధైర్యంగా నిలబడ్డారు. వారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. కార్యకర్తల త్యాగాలు మర్చిపోను. అక్రమ అరెస్టులకు భయపడను. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కేడర్ మరింత ఉత్సాహంగా పనిచేయాలని, కుప్పంలో నాయకుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో పర్యటిస్తానని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినవారిని వదిలే ప్రసక్తి లేదని భరోసా ఇచ్చారు.సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, మునిరత్నం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
తెదేపాలోకి భారీగా చేరికలు
నైపుణ్యాభివృద్ధి కేసులో బెయిల్పై విడుదలయ్యాక చంద్రబాబు తొలిసారి పార్టీ కార్యాలయానికి వస్తుండటంతో ఆయనను కలిసేందుకు తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఏలూరుకు చెందిన మాజీ మంత్రి మరడాని రంగారావు, ఏలూరు ఆటో యూనియన్ అధ్యక్షుడు నాగబోయిన లీలాకృష్ణ గురువారం తెదేపాలో చేరతారు. కదిరి నియోజకవర్గ వైకాపా నాయకులు, తలుపుల మండల వైకాపా అధ్యక్షుడు శంకర వీరవరప్రసాద్, కొందరు మాజీ సర్పంచులు పార్టీలో చేరనున్నారు. శుక్రవారం రామచంద్రపురం, తంబళ్లపల్లి, పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల నుంచి చంద్రబాబు సమక్షంలో పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేరికలు ఉంటాయని తెదేపా వర్గాలు తెలిపాయి. వైకాపా బహిష్కృత ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో తెదేపాలో చేరనున్నట్టు సమాచారం. చంద్రబాబు ఈ నెల 21న ఉదయం విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయాన్ని సందర్శిస్తారని, సాయంత్రం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కృష్ణా జిల్లా అనిగండ్లపాడుకు చెందిన చిరువ్యాపారి డి.శ్రీనివాసరావు రూ.65 వేలు ఖర్చు పెట్టి బంగారంతో చేయించిన సైకిల్ గుర్తు నమూనా, గొలుసును చంద్రబాబుకు కానుకగా అందజేశారు. 2011లో జరిగిన ప్రమాదంలో తనకు తుంటి ఎముక దెబ్బ తిందని, శస్త్రచికిత్స చేయించుకోవడానికి డబ్బుల్లేక అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబును కలిశానని చెప్పారు. ఆయన సిఫార్సుతో తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రిలో తనకు ఉచితంగా వైద్యం చేశారని గుర్తుచేశారు. ఆ కృతజ్ఞతతోనే చంద్రబాబుకు చిరు కానుక అందజేశానన్నారు.