Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మూడేళ్ల క్రితం తెలుగురాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపి… తెలంగాణ రాజకీయాల గతి మార్చిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ… ఓటుకు నోటు కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారన్న వార్త కొత్త రాజకీయ సమీకరణాలను ఆవిష్కరిస్తోంది. టేపుల్లో ఉన్న గొంతు చంద్రబాబుదే అని చండీగఢ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక నిర్ధారించిందని… ఎలాంటి ఒత్తిళ్లూ ఉండవు… స్వేచ్ఛగా పనిచేసుకోండని కేసీఆర్ పోలీసులను ఆదేశించారన్న వార్తల లీకులు… తెలుగురాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఎక్కడచూసినా ఇదే హాట్ టాపిక్. రాజకీయనేతలు ప్రతి ఒక్కరూ దీనిపైనే స్పందిస్తున్నారు. ఓటుకు నోటు కేసును నీరుగార్చవద్దని ఏపీ బీజేపీ కేసీఆర్ ను కోరింది. ఫెడరల్ ఫ్రంట్ కోసం దేశం మొత్తం తిరుగుతున్న కేసీఆర్ ఓటుకు నోటు కేసును పక్కన పెట్టే ప్రయత్నం చేయరాదని, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి విజ్ఞప్తిచేశారు. చంద్రబాబు వాయిస్ కు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ను ప్రజలకు వెల్లడించాలని కోరారు.
తెలంగాణలో సమస్యలు పక్కదారి పట్టించేందుకే ఓటుకు నోటు కేసును మళ్లీ తెరపైకి తెస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు ఆరోపించారు. ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక నివేదిక తేల్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవినుంచి చంద్రబాబు గౌరవప్రదంగా తప్పుకోవడం మంచిదని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య సూచించారు. అటు కేసీఆర్ సమీక్షపై ఏపీ మండిపడుతోంది. ఓటుకు నోటు కేసు ఒక అక్రమ కేసు అంటూ మత్తయ్య పిటిషన్ వేసిన సమయంలోనే హైకోర్టు కామెంట్ చేసిందని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తుచేశారు. హైకోర్టు విచారిస్తున్న కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎలా సమీక్షిస్తారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ ఓటుకు నోటు కేసుతో పాటు పెండింగ్ లో ఉన్న అన్ని కేసులను సమీక్షించే అధికారం ముఖ్యమంత్రికి ఉందని చెప్పారు. ఎన్నికలకు, కేసులకు సంబంధం లేదన్నారు.
ఓటుకు నోటు కేసును సీబీఐతో విచారణ జరిపించాలని గతంలో ఆ కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య డిమాండ్ చేశారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ లపై విచారణ జరిపించాలని కోరారు. ఓటుకు నోటు కేసులో తనను కోవర్ట్ గా మార్చేందుకు మంత్రి కేటీఆర్ గన్ మెన్ ప్రయత్నించారని, తాను ఒప్పుకోకపోతే బెదిరించారని చెప్పారు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి మోడీ, కేసీఆర్ కలిసి ఆడుతున్న నాటకంలో భాగమే ఇదంతా అని రేవంత్ మండిపడ్డారు. కేసుకు సంబంధించిన వివరాలు చెప్పాలని తాను అనుకోవడం లేదని, ఈ విషయంపై మాట్లాడవద్దని కోర్టు ఆంక్షలు విధించిందని, కేసీఆర్ తీరును మాత్రం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మోడీ ఆదేశాల మేరకు కేసీఆర్ పలువురు అధికారులతో ఏడుగంటల పాటు ఈ కేసుపై చర్చించారని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుపై మోడీ, కేసీఆర్ అవినీతిని ప్రజల్లో ఎండగడుతున్న తనపై కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకోసం ఈ నాటకం ఆడుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డే కాదు… రెండు తెలుగురాష్ట్రాల్లోని రాజకీయవిశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబును ఇరుకునపెట్టేందుకే కేసీఆర్ ద్వారా ఓటుకు నోటు కేసును కేంద్రం తిరిగి తెరపైకి తెచ్చిందని, దీన్ని బట్టి చూస్తే… కేసీఆర్ ఏర్పాటుచేయతలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ కూడా మోడీకి లాభం కలిగించేందుకే అన్న వాదనలు నిజమేనని విశ్లేషిస్తున్నారు.