Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో మైనారిటీ అన్న మాట ఎందుకు సక్సెస్ మంత్రం అయ్యిందో ఇప్పటికి అర్ధం అవుతోంది కమ్మోళ్లకి. తెలంగాణాలో తాము మైనారిటీ అయినా తమ కోసం ఇటు రెడ్లు కాంగ్రెస్ గొడుగు కింద నుంచి, వెలమలు అటు తెరాస ఛత్రం కింద నుంచి ఆహ్వానాలు పలకడాన్ని ఆ కులం ఆశ్చర్యంగా చూస్తోంది. వీళ్లేనా నిన్నమొన్నటిదాకా తమని శత్రువుగా చూసింది అనిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ ఏర్పాటు, అక్కడ టీడీపీ అస్తిత్వం ప్రమాదంలో పడ్డాక కమ్మలు కూడా తమ అవసరాల రీత్యా ఏదో ఒక ప్రత్యామ్న్యాయం చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ లో తొలి నుంచి అన్ని రంగాల్లో ప్రభావశీల శక్తిగా వున్న కమ్మ కులం రాజకీయంగా మాత్రం రెడ్ల కి పోటీ ఇవ్వలేకపోయింది. ఎన్టీఆర్ టీడీపీ స్థాపన తర్వాత ఆ లోటు కూడా తీరింది. కానీ రోజులు ఎప్పుడూ ఒకే రకంగా వుండవు కదా. వై.ఎస్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆ కులం రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. వై.ఎస్ మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఉదృతం కావడంతో ఆ సెగ కూడా బాగా తగిలింది. ఎన్టీఆర్ సీఎం అయ్యాక హైదరాబాద్ లో శరవేగంగా తమ వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకున్న కమ్మలు వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ఐటీ రంగం ఊపు అందుకున్నాక ఆ కులానికి సంబందించిన యువకులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి అండగా వుంటూ వచ్చిన కమ్మలు తెలంగాణ ఆవిర్భావం తర్వాత పొలిటికల్ అడుగులు ఎటు వేయాలి అనేదానిపై సందిగ్ధంలో పడ్డారు.
ఇక తెలంగాణాలో టీడీపీ కి అధికారం అనే మాట కల అని అర్ధం చేసుకున్న టైం లో కమ్మలు కొంత అభద్రతకు లోనయ్యారు. అయితే వారు ఊహించినట్టు కాకుండా అధికారం వచ్చిన ఏడాది నుంచి కెసిఆర్ నుంచి వారికి సానుకూల ఫీలర్లు వస్తూనే వున్నాయి. తుమ్మలకి మంత్రి పదవి ఇవ్వడం నుంచి రామోజీకి ప్రశంసలు ఇవ్వడం దాకా తెరాస సెట్ట్లెర్స్ కి మరీ ముఖ్యంగా కమ్మలకి వ్యతిరేకం కాదన్న అభిప్రాయం కలిగించింది. ఇక పరిటాల శ్రీరామ్ పెళ్లి ఎపిసోడ్ తో ఈ బంధం ఇంకాస్త బలపడింది. ఒకప్పుడు జలగం వెంగళరావు ప్లాన్ చేసిన వెల్ కం గ్రూప్ ( కమ్మ , వెలమ రాజకీయ బంధం ) ఐడియా మళ్లీ ముందుకు వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 15 నుంచి 20 స్థానాల్లో కమ్మ ఓటర్లు పెద్ద సంఖ్యలో వున్నారు. ఖమ్మం జిల్లా అంతటా వీరి ప్రభావం వుంది. ఇక రంగారెడ్డి, నిజామాబాదు, వరంగల్ జిల్లాల్లో చెదురుమదురుగా వీళ్ళ ఓట్లు వున్నాయి. గెలుపు ఓటముల్ని నిర్దేశించకపోయినా తెలంగాణాలో 40 సీట్లలో వీరి ప్రభావం ఉంటుంది. ఇది మొత్తం తెలంగాణ నియోజకవర్గాల్లో మూడో వంతు. ఈ లెక్కలు చూసుకుని కెసిఆర్ ముందుగానే పావులు కదిపారు. కాస్త ఆలస్యంగా ఈ విషయం గ్రహించిన కాంగ్రెస్ రేవంత్ ద్వారా వారికి గాలం వేసేందుకు ప్రయత్నిస్తోంది.
తెలంగాణాలో రాజకీయ ఆధిపత్యం కోసం పోరాడుతున్న రెండు వర్గాలు ఇప్పుడు కమ్మ ల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నా వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రెడ్లు, కాంగ్రెస్ తో ఆదినుంచి వున్న వైరం, ఉద్యమ సమయంలో తెరాస వాడిన భాష కమ్మల్ని ఏ నిర్ణయం వడివడిగా తీసుకోలేని పరిస్థితి కల్పించాయి. పైగా సోషల్ మీడియా కమ్మ గ్రూప్ ల పేరిట కొందరు తెరాస బెస్ట్ అని, ఇంకొందరు కాంగ్రెస్ బెటర్ అని మెసేజెస్ పెద్ద ఎత్తున పంపడం చూసి వాళ్ళు ఆలోచనలో పడుతున్నారు. ప్రస్తుతానికి గుంభనగా ఉంటున్నప్పటికీ అన్ని విధాలుగా తమ భద్రతకు ఇబ్బంది లేదనుకున్న పార్టీ వైపే వాళ్ళు మొగ్గుజూపుతారు. అందుకే కమ్మలకి రెడ్లు , వెలమలు ఆ భరోసా ఇవ్వడానికి తెగ పోటీ పడుతున్నారు.