Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పద్మావతి వివాదం ముగింపు దశకు చేరుకుంది. అయితే సినిమాకు ఈ టైటిల్ కొనసాగే అవకాశం కనిపించడం లేదు. పద్మావతిలో రాజ్ పుత్ లను అవమానించే సన్నివేశాలు ఉన్నాయని రాజ్ పుత్ కర్ణిసేన ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సినిమాకు సెన్సార్ బోర్డ్ కఠిన షరతులు విదించింది. వాటికి పద్మావతి చిత్ర యూనిట్ ఒప్పుకుంటే త్వరలోనే సినిమా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రాకముందే మీడియాకు ప్రదర్శించడంపై సీబీఎఫ్ సీ ఆగ్రహం వ్యక్తంచేసి పద్మావతి విడుదలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో డిసెంబరు 1 న విడుదల కావాల్సిన పద్మావతి వాయిదా పడింది.
అనంతరం సంజయ్ లీలా భన్సాలీ దీనిపై బోర్డుకు వివరణ ఇచ్చారు. రాజ్ పుత్ ల ఆందోళనల వల్లే సినిమాను ముందుగా మీడియాకు చూపించాల్సివచ్చిందని తెలిపారు. సినిమా విడుదల వాయిదా పడడంతో వివాదాలు కూడా సద్దుమణిగాయి. ఈ నేపథ్యంలో పద్మావతిపై ప్రత్యేక ప్యానెల్ సమీక్షా సమావేశంలో విస్తృతంగా చర్చించి కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తోంది. తాము చెప్పిన ప్రతిపాదనలకు పద్మావతి యూనిట్ అంగీకరిస్తే యూ బై ఏ సర్టిఫికెట్ జారీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని సీబీఎఫ్ సీ తెలిపింది. సినిమా పేరును పద్మావతికి బదులు పద్మావత్ గా మార్చాలన్నది సీబీఎఫ్ సీ మొదటి నిబంధన. దాంతో పాటు సినిమాలో 26 సీన్లు తొలగించాలని ఆదేశించింది. ఘూమర్ ను, సతిని గొప్ప విషయాలుగా చూపించరాదని స్పష్టంచేసింది. భారతదేశంలోని ఏ రాష్ట్ర చరిత్రతో ఈ సినిమా కథకు సంబంధం లేదని ప్రకటించాలని, సినిమా సన్నివేశాల మధ్యలో మూడుసార్లు ఈ ప్రకటనలు ప్రసారం చేయాలని షరతు విధించింది.
ఈ షరతులకు చిత్ర యూనిట్ సూచన ప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. మరో దఫా సమావేశంలో దీనిపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. సంజయ్ లీలా భన్సాలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పద్మావతిని తెరకెక్కించారు. చిత్తోర్ రాణి పద్మిణి జీవితం ఆధారంగా తెరకెక్కిన పద్మావతిలో అవాస్తవ విషయాలకు చోటు కల్పించారన్నది కర్ణిసేన ఆందోళన. అలాగే తమ జీవితాల్లో ఒక్కసారైనా కలుసుకోని పద్మిణి, ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య పద్మావతిలో ప్రేమ సన్నివేశాలు ఉన్నాయన్న ప్రచారమూ ఈ ఆందోళనలకు దారితీసింది. అయితే భన్సాలీ దీనిపై పదే పదే వివరణ ఇచ్చారు. పద్మావతి, ఖిల్జీ కలుసుకునే సన్నివేశాలే సినిమాలో లేవని స్పష్టంచేశారు. అయినప్పటికీ…రాజ్ పుత్ ల ఆందోళనలు కొనసాగాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని సినిమాపై నిషేధం విధించాయి. అయితే ఈ వివాదాల సంగతి పక్కన పెడితే ప్రేక్షకులు మాత్రం పద్మావతి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వారి నిరీక్షణకు తెరపడనుంది.