సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు, గాలి జనార్ధన రెడ్డి మరియు వైసీపీ అధినేత జగన్ అక్రమాల కేసులను దర్యాప్తు చేసి, వారి అక్రమాలను వెలుగులోకి తెచ్చిన సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ గురించి తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తన పదవికి స్వచ్ఛందంగా విరమణ చేసిన జేడీ లక్ష్మీనారాయణ నవంబర్ 26 న రాజకీయ పార్టీ ని ప్రారంభించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. అయితే జేడీ లక్ష్మీనారాయణ నెలకొల్పే పార్టీ పేరు ఏమై ఉంటుందా అని ఇప్పుడు ప్రజలతో పాటు, రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. జేడీ లక్ష్మీనారాయణ ని తన పేరుని జేడీ గా అందరూ పిలుస్తారు కాబట్టి పార్టీ పేరు “జన ధ్వని” అని పెట్టొచ్చని వినికిడి. ఈ పేరే కాకుండా ‘వందేమాతరం’ అనే పేరు కూడా పరిశీలనలో ఉంది. ఈ రెండు పేర్లలో జేడీ లక్ష్మీనారాయణ “జన ధ్వని” పేరుకే మొగ్గుచూపుతున్నారని తెలుస్తుంది.
ఈ నెల 26 న హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఏర్పాటుచేసే సభా వేదికలో తన రాజకీయ పార్టీ పేరుని వెల్లడిస్తారని సమాచారం. అంతేకాకుండా ఆ సభకు హాజరైన వారి నుండి పార్టీ పేరుకి సంబంధించిన సూచనలను కూడా సేకరిస్తారని తెలుస్తుంది. సిబిఐ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసిన అనంతరం జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలలో పర్యటించి, రైతుల కష్టాలను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. కొన్ని నెలల ముందు తిత్లీ తుఫాను చేత అతలాకుతలం కాబడిన శ్రీకాకుళం జిల్లాలోని పలుప్రాంతాలను పర్యటించి, అక్కడి జనాలతో మమేకమయ్యారు. జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి రాబోతున్న విషయం ముందుగానే ఊహించిన టీడీపీ, వైసీపీ పార్టీలు తమలో చేరడానికి ఆహ్వానించినా, బీజేపీ పార్టీలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపించినా, చివరికి సొంత రాజకీయ పార్టీ పెట్టడానికే జేడీ లక్ష్మీనారాయణ మొగ్గు చూపారు.