తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు ఈసీ సంకేతాలు ఇచ్చింది. 10 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో పర్యటించిన ఉమేశ్ సిన్హా నేతృత్వంలోని బృందం రాష్ట్రంలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎన్నికల దిశగా అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించిన ఉమేశ్ సిన్హా బృందం ఎన్నికల ఏర్పాట్లు, సంసిద్ధతను పర్యవేక్షించిన విషయం తెలిసిందే. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణకు కూడా ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాంలతో పాటు తెలంగాణకు ఎన్నికలు జరగనున్నాయి. అతి త్వరలోనే ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
అలాగే అటు రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల బాబితా సవరణ తదితర ప్రక్రియలు వేగంగా సాగుతున్నాయి. ఈవీఎంలు, వీవీప్యాట్లను ఇప్పటికే సిద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నికలకు సిద్ధంగా ఉందంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కూడా ఈసీకి తెలిపారు. అతి త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. అనంతరం ఎన్నికల తేదీలపై తుది కసరత్తు చేయనుంది. అక్టోబర్ రెండో వారంలో 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.