Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రభుత్వం ఉంది అందరి కోసం. అంతే కానీ ప్రజల్ని విడగొట్టి ముక్కలు చెక్కలు చేయడానికి కాదు. విమానాల కంటే నౌకల్లో ప్రయాణం చౌక. అందుకే చాలా మంది ఇప్పటికీ విదేశాలకు నౌకల్లో వెళ్తుంటారు. అంత మాత్రాన వారిని ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూస్తారా… విమానాల్లో వెళ్లే వాళ్లు ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్లా… ఇప్పుడీ చర్చ ఎందుకు అంటారా… మోడీ తీసుకున్న నిర్ణయం కొత్త రాద్ధాంతానికి దారితీసేలా ఉంది.
ఇప్పటిదాకా విదేశాలకు వెళ్లే భారతీయులు తాము ఏ దేశానికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఎన్ని రోజులు ఉంటాం… వంటి వివరాలతో ఓ డిక్లరేషన్ ఫామ్ నింపాల్సి ఉండేది. కానీ ఇకపై ఆ అవసరం ఉండదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కానీ చావుకబురు చల్లగా చెప్పిన కేంద్రం… ఇది విమానాల్లో ప్రయాణించేవారికి మాత్రమేనని స్పష్టం చేసింది. దీంతో సగటు భారతీయుడు నిరాశలో కూరుకుపోయాడు.
అసలెందుకీ వివక్ష. విమానాల ఎక్కువేంటి. నౌకల తక్కువేంటి. నౌకలతో పోలిస్తేనే విమానాలే టెర్రరిస్టులకు ఎక్కువ టార్గెట్ అవుతున్నాయి. అలాంటప్పుడు వాటిని వదిలేయడమేంటని రక్షణ కనిపుణులు కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ కేంద్రంలో మోడీ సర్కారుకు ఇలాంటివేమీ పట్టినట్లు కనిపించడం లేదు. విమానాల్లో అయితే ధనవంతులు, రాజకీయ నేతలు ప్రయాణిస్తారు కాబట్టి… వారికి ఇబ్బంది లేకపోతే చాలనుకుంటున్నారేమో.