తూర్పుగోదావరి జిల్లాలో వైసిపికి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నేత, కాకినాడ పార్లమెంటుకు పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ పార్టీకి రాజీనామా చేయటం ఖాయమని సమాచారం. 2009లో ప్రజారాజ్యంపార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అప్పటి ఎంపీ పల్లం రాజు చేతిలో ఓడిపోయిన ఆయన తర్వాత వైసిపిలోకి మారారు. అప్పటి నుండి బాగా యాక్టివ్ గానే ఉన్నారు. సునీల్ ఆర్దికంగా బలవంతుడు కావడం వైసీపీ కూడా ఆయనను బాగానే ఉపయోగించుకునేది. మొన్నటి జగన్ పాదయాత్రలో కూడా ఆయన జగన్ వెంటే ఉన్నారు. అయితే పార్టీలోని స్ధానిక నాయకత్వంతో తలెత్తిన విభదాల కారణంగా జగన్ పాదయాత్ర అయిన నాటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఎంపిగా టిక్కెట్టు విషయంలో కూడా జగన్ నుండి హామీ రాలేదట. దీంతో ఆయన పార్టీ మారాలని భావిస్తున్నారని తెలిసింది. అదే సమయంలో సునీల్ పరిస్ధితిని గమనించిన తెలుగుదేశంపార్టీ, జనసేన పార్టీలు నేతలు సునీల్ ను పార్టీల్లోకి చేర్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా కాలంగా టిడిపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకనో సునీల్ సానుకూలంగా స్పందించటం లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ తోట నరసింహం ఎంపీగా ఉన్నారు. ఆయనని తప్పించి తనకు టికెట్ ఇచ్చే పని ఉండదని ఆయన భావిస్తున్నారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారు అనేది సస్పెన్స్ గా మారింది.