Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఏంటి… వైసీపీ అధినేత జగన్ జేబు ఖాళీ చేయడం ఏంటి అనుకుంటున్నారు. జేబు అనగానే మనకు డబ్బు గుర్తుకు వస్తుంది. కానీ రాజకీయ నాయకుడికి జేబు లో ఉండేది ధనం కన్నా జనం. ఇప్పుడు ఆ జనాన్నే జగన్ వైపు లేకుండా చేస్తున్నాడు బాబు. 2014 ఎన్నికల ముందు వైసీపీ అధికారంలోకి రావడం కేవలం లాంఛనం అనుకున్నారు జగన్. అందుకు కారణం లేకపోలేదు. రెడ్లు, ఎస్సీలు, ముస్లిమ్స్ పెద్ద ఎత్తున జగన్ వెంట నడిచారు. ఉప ఎన్నికల్లో అదే ప్రతిఫలించింది. దీంతో ఆ వర్గాలను నమ్ముకుని జగన్ అధికారం మీద ఆశలు పెంచుకున్నారు. కాపులు కూడా తమకు అండగా వుంటారు అనుకున్నా పవన్ కళ్యాణ్ చివరి క్షణంలో రంగంలోకి దిగి సీన్ మార్చేశారు. అయినప్పటికీ మిగిలిన వర్గాలు అండగా నిలవడంతో జగన్ 67 స్థానాల్లో విజయం సాధించారు. ఇంకో 5 లక్షల ఓట్లు వచ్చి ఉంటే తనదే అధికారం అని జగన్ ధీమా వెనుక వున్న ఆ వర్గాలను నెమ్మదిగా తన వైపు లాక్కుంటున్నారు చంద్రబాబు.
కిందటి ఎన్నికల్లో వైసీపీ కి వచ్చిన స్థానాల్లో మెజారిటీ రాయలసీమ జిల్లాల నుంచి వచ్చినవే. ప్రకాశం జిల్లా సగం నుంచి మొదలైన జగన్ హవా రాయలసీమలో కూడా ఒక్క అనంతపురం మినహా అన్ని జిల్లాల్లో కొనసాగింది. దీనికి కారణం ఆ ప్రాంతాల్లో రెడ్లకు వున్న రాజకీయ ఆధిపత్యం. ఈ విషయం గమనించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాయలసీమలో రెడ్డి నేతలను పార్టీలోకి ఆహ్వానించడంలొ సక్సెస్ అయ్యారు. ఆదినారాయణ రెడ్డి, అమరనాథరెడ్డి, భూమా కుటుంబాలు అలా టీడీపీ గూటికి చేరి మంత్రివర్గంలో స్థానం సంపాదించిన వాళ్లే. ఇక ఇటీవల మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కూడా టీడీపీలో చేరారు. ఆయన కూడా దేశంలో చేరి రాజంపేట నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇలా రెడ్డి నాయకులను రాజకీయంగా ఆకర్షించడం కోసం సాగు, తాగు నీటి అవసరాల మీద దృష్టి పెట్టడంతో వారికి కూడా వేరే ప్రత్యామ్న్యాయం లేకుండా పోయింది. సీమ ఉద్యమం నడిపించాలని చూసిన బైరెడ్డి కూడా ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో కూడా రెడ్డి నాయకులు కొందరు వైసీపీ నుంచి టీడీపీ లో చేరారు. మరికొందరు అదే బాటలో వున్నారు.
ఇక జగన్ కి అండగా నిలిచిన మరో వర్గం ముస్లిమ్స్. బీజేపీ తో టీడీపీ పొత్తు కారణంగా ఈ వర్గం వైసీపీ కి పూర్తి అండగా నిలిచింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల దగ్గర నుంచి బీజేపీ తో పొత్తు కోసం జగన్ వెంపర్లాడడం చూసి ముస్లిం మైనారిటీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ విషయం తెలిసినప్పటికీ జగన్ ఇంకా బీజేపీ తో జత కట్టేందుకు ఉవ్విళ్ళూరడం చూసి ముస్లిం మైనారిటీల్లో ఇంకా కోపం పెల్లుబికుతోంది. అందుకే వాళ్ల్లు ప్రత్యామ్న్యాయం గా టీడీపీ వైపు చూస్తున్నారు. ఇక జగన్ కి అండగా నిలిచిన ఎస్సీ లను ఆకట్టుకోడానికి ఇప్పుడు టీడీపీ చేపట్టిన దళిత తేజం కార్యక్రమానికి కూడా మంచి స్పందన వస్తోంది. ఇక రిజర్వేషన్ వ్యవహారం తర్వాత కాపులు వైసీపీ గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ విధంగా చూస్తున్నప్పుడు జగన్ జేబు బాబు ఖాళీ చేస్తున్నాడు అని చెప్పుకోవడంలో ఆశ్చర్యం ఏముంది ?