చంద్రులిద్దరు ఒకవైపు… మోడీ ఒకవైపు.

Chandrababu and KCR meet to do attack on Modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగు రాష్ట్రాల్లో 2019 సార్వత్రిక ఎన్నికల దృశ్యం ఎలా ఉండబోతోందో చూఛాయగా అర్ధం అవుతోంది. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖరరావు ఒక్క తాటి మీదకు రాబోతున్న విషయం దాదాపుగా స్పష్టం అయిపోయింది. నిన్న తెలంగాణాలో పొత్తుల గురించి టీడీపీ శ్రేణులతో అధినేత చంద్రబాబు మాట్లాడిన మాటలతో ఈ క్లారిటీ వచ్చేసింది. బీజేపీనే ముందుగా తెగదెంపులు చేసుకున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన కాంగ్రెస్ తో కూడా కలిసే అవకాశం లేదని కొట్టిపారేశారు. ఇక ఆయన చెప్పినా చెప్పకపోయినా మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ తెరాస. దీంతో టీడీపీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అయితే పొత్తులు ఉంటాయన్న క్లారిటీ వారికి దొరికింది. చంద్రబాబు ఈ విధంగా మాట్లాడ్డం, తెలంగాణ సీఎం కెసిఆర్ రైతు సమస్యల మీద మోడీని తూర్పారబట్టడం దాదాపు ఒకే కాలంలో జరిగింది. ఇదేమీ కాకతాళీయం కాదు. ఒక వ్యూహమే.

మోడీ ప్రధాని అయిన దగ్గరనుంచి అది మిత్రపక్షమా, శత్రు పక్షమా అని లేకుండా ఏ రాష్ట్రం లోను ప్రాంతీయ శక్తులు రాజకీయ ప్రాబల్యం లేకుండా చూడాలని కంకణం కట్టుకున్నారు. కానీ ఒక్క రాష్ట్రంలో కూడా ఆ టార్గెట్ రీచ్ కాలేదు. పైగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ధోరణితో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. రాజకీయంగా పదేళ్లు ముందు పరిణామాలను అంచనా వేయగలిగిన చంద్రులు ఇద్దరు మోడీ దూకుడుని ఎప్పుడో కనిపెట్టారు. అయితే అదను కోసం వేచి చేస్తున్నారు. దేశవ్యాప్తం గా జరుగుతున్న కొన్ని ఎన్నికలు, ఉపఎన్నికల్లో బీజేపీ బలహీన పడిందన్న సంకేతాలు అందాక మోడీ మీద గొంతు ఎత్తుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక శక్తుల్ని ఒక గొడుగు కిందకి తీసుకురావాలంటే ముందుగా ఇక్కడ తాము కలిసి పనిచేస్తే ఓ విశ్వసనీయత ఏర్పడుతుందని చంద్రులు ఇద్దరు గుర్తించారు. పైగా తాము ఢీకొట్టబోయేది ప్రధాని మోడీ తో అన్న విషయం వారికి బాగా గుర్తుంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ, కాంగ్రెస్ యేతర జాతీయ కూటమికి చంద్రులు ఇద్దరు రధసారధులుగా ముందుండి నడిపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.