Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఊహించిందే జరిగింది. టీడీపీ-బీజేపీ బంధానికి తెరపడింది. కేంద్రమంత్రివర్గం నుంచి టీడీపీ వైదొలిగింది. బుధవారం సాయంత్రం ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యంకాదని అరుణ్ జైట్లీ ప్రకటించిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. సచివాలయంలో టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీలంతా ఎన్టీయే నుంచి బయటకి వచ్చేందుకే మొగ్గుచూపారు. అనంతరం మంత్రులతో సమాలోచనలు జరపగా వారంతా కూడా వైదొలగాలనే సూచించారు. కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరితో ఫోన్లో మాట్లాడగా… వారిద్దరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ఈ పరిణామాల తర్వాత రాత్రి 11 గంటలసమయంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, కళావెంకట్రావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులు వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.
ఏ ఉద్దేశంతో అయతే కేంద్రమంత్రివర్గంలో చేరామో… అది నెరవేరనప్పుడు ఇంకా అక్కడ ఉండడం వృథా అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం తొలి అడుగుగా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాయని, ఎన్డీఏలో కొనసాగాలా… వద్దా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. పరిపక్వత గల రాజకీయ నాయకుడిగా ఈ విషయాన్ని ప్రధానికి చెప్పడం బాధ్యతగా భావించి సంప్రదించినా ఆయన ఫోన్ లో అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఏపీకి సాయం చేసే ఉద్దేశం కేంద్రప్రభుత్వంలో ఏ మాత్రం కనిపించడం లేదని, ఈ విషయంలో వారు ముందే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టుందని చంద్రబాబు ఆరోపించారు. దేశరక్షణ కోసం ఉపయోగించే డబ్బులు కూడా ఏపీ ఇమ్మని అడిగిన అర్ధమొచ్చేలా అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం, అవమానకరమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల హక్కుల కోసమే తాను పోరాడుతున్నానని, నాడు ఇచ్చిన హామీల్లో తాను కూడా భాగస్వామినన్న విషయాన్ని బీజేపీ మర్చిపోయిందని మండిపడ్డారు. విభజన హామీలు నెరవేర్చాలని తాను ఎంతగానో పోరాడానని 29 సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలిశానని తెలిపారు. నాడు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నేతలు కూడా డిమాండ్ చేశారన్న విషయాన్ని గుర్తుచేసిన చంద్రబాబు, ఇప్పుడు ఇతర రాష్ట్రాల సెంటిమెంట్ ను బూచిగా చూపించడం ఏంటని ప్రశ్నించారు.