Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి క్యాబినెట్ లో భారీగా మార్పులు చేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. డిసెంబర్ లేదా సంక్రాంతి పండగ తర్వాత ఈ మార్పులు వుండే అవకాశం వుంది. ఎన్నికల ఏడాదిలో పడుతున్నందున ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను, పార్టీ వాణి బలంగా వినిపించే వాళ్ళు క్యాబినెట్ లో వుండాలని చంద్రబాబు భావిస్తున్నారట. అదే టార్గెట్ ఈసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వుండబోతోంది.
క్యాబినెట్ లో అనూహ్య మార్పులు వుండే అవకాశం ఉందట. చంద్రబాబు కుడిభుజం అనుకున్న ఓ నాయకుడిని మంత్రివర్గం నుంచి పక్కనబెట్టి పార్టీ కార్యక్రమాలకే పరిమితం చేసే అవకాశం ఉందట. ఇక పార్టీలో బాగా సీనియర్ గా పేరుండి, చంద్రబాబు దగ్గరకు ఎప్పుడైనా వెళ్లగలిగే స్థాయి వున్న ఓ నాయకుడు ని కూడా క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశం వుంది. ఈయనకు రాజ్య సభ ఛాన్స్ దక్కుతుందట. ఇక పార్టీ లో ఫైర్ బ్రాండ్ గా పేరు పడ్డ ఓ ఎమ్మెల్యేకు క్యాబినెట్ లో అవకాశం దొరకొచ్చట. ఈయన వివాదాలకు దగ్గరగా ఉంటారని పేరు ఉన్నప్పటికీ పార్టీ అంశంలో అంకిత భావమే ఆయనకు ఛాన్స్ దక్కేలా చేస్తోందట.
ఇక వైసీపీ నుంచి పార్టీలో చేరిన ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు వచ్చే క్యాబినెట్ లో బెర్త్ దొరకవచ్చని తెలుస్తోంది. ఈయనకు యువనేత లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసినప్పుడు పార్టీలో కొత్త తరానికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. క్యాబినెట్ లో మార్పులు తర్వాత ప్రజలు కూడా ఇలాగే భావించేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు చంద్రబాబు. 2019 ఎన్నికల దృష్టితో చేస్తున్న ఈ మార్పుల నుంచి చంద్రబాబు భారీగా రాజకీయ ప్రయోజనం వుండాలని ఆశిస్తున్నారు.