Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఒకప్పుడు రాజధాని నిర్మాణాన్ని మెచ్చుకున్నవాళ్లే… ఈ రోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. కేంద్రానికి దాసోహమయ్యే పరిస్థితి తన జీవితంలో రాదని, ఇప్పటివరకు కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపామని, అయినా ఇంకా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చేందుకు పదేళ్ల సమయం పడుతుందని చంద్రబాబు తెలిపారు. 2022 నాటికి ఏపీని దేశంలోని మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఉంచేలా ముందుకెళ్తున్నామని వివరించారు. కేంద్రప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాలని, ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇస్తుంది ముష్టి కాదని, ఆ నిధులు పొందడం ఏపీ హక్కని, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు గౌరవభావంతో ఉండాలని, రాష్ట్రాలకు హానీ చేసేలా కేంద్రం ప్రవర్తించడం సరికాదని చంద్రబాబు హితవుపలికారు. రాష్ట్ర హక్కులను సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వారికే నష్టం జరుగుతుందని గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
హక్కుల కోసం ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధి చెందకూడదనే కేంద్రం ఆలోచిస్తోందని, అండగా నిలబడాల్సిన కేంద్రం మొండిచేయి చూపడంలోనే వారి దురుద్దేశం అర్ధమవుతోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నాలుగేళ్లు ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఇప్పుడు పట్టిసీమలో అవినీతి అంటోందని, పోలవరంపై విమర్శలు చేస్తోందని, అమరావతిపై కొందరు మాట్లాడుతోంటే బాధేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ రాజధాని ఏర్పాటుచేస్తే కేంద్రానికీ పేరొస్తుందని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బ్రహ్మాండమైన రాజధానిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. రాయలసీమ డిక్లరేషన్ అంటూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, జాతీయ పార్టీకి ఓ పద్ధతి ఉండాలని, రాజకీయ విభేదాలు ఉన్నంత మాత్రాన ప్రజల మనోభావాలతో ఆడుకోవడం, ప్రజలకు నష్టం చేయడం మంచిది కాదని హితవుపలికారు. రాయలసీమను ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని, ఎప్పుడూ జరగనంత అభివృద్ధి జరుగుతోంటే కొందరికి అసూయ కలుగుతోందని సీఎం ఆరోపించారు. కొందరు స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో లాలూచీ పడుతున్నారని, అలాంటి వారికి బుద్ధి చెప్పాలని చంద్రబాబు ప్రజలను కోరారు.