టీడీపీ గెలుపు చారిత్ర‌క అవ‌స‌రంః చంద్ర‌బాబు

chandrababu comments on Karnataka politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాష్ట్రంలో మ‌ళ్లీ టీడీపీ గెలుపు చారిత్ర‌క అవ‌స‌రం అని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వ్యాఖ్యానించారు. దీనిపై ప్ర‌తి ఊళ్లో, ప్ర‌తి ఇంట్లో చ‌ర్చ జ‌ర‌గాల‌న్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చేది ద‌యాదాక్షిణ్యాల‌పై కాద‌ని, అది రాష్ట్ర ప్ర‌జ‌ల హ‌క్క‌ని, రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయంపై ప్ర‌తి ఒక్క‌రూ కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని ముఖ్య‌మంత్రి పిలుపునిచ్చారు. ధ‌ర్మ‌పోరాటం కొన‌సాగించాల‌ని, హ‌క్కుల‌ను సాధించాలనే ఆవేశం, ఆలోచన అనునిత్యం రావాల‌ని చంద్ర‌బాబు అన్నారు. ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరులో నిర్వ‌హించిన నీరు-ప్ర‌గతి కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్య‌లు చేశారు. త‌క్కువ వ‌న‌రులు ఉన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తుంటే రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలు త‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. తాను ప్ర‌జ‌ల సంక్షేమం కోసమే కష్ట‌ప‌డుతున్న‌ట్టు చెప్పారు.

ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, వైసీపీలో అవినీతిప‌రులు కొంద‌రు త‌న‌ను విమ‌ర్శిస్తున్నార‌ని, ఏక‌వ‌చ‌నంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తంచేసిన ముఖ్య‌మంత్రి అయినా ఆ మాట‌ల‌న్నీ ప్ర‌జ‌ల కోస‌మే ప‌డుతున్నాన‌న్నారు. పార్టీల విధానాల‌ను చెప్ప‌డం, ప్ర‌జ‌ల‌కు ఏం చేశామో వివ‌రిస్తూ వారిని చైత‌న్య‌ప‌ర‌చ‌డ‌మే ప్ర‌జాస్వామ్యంలో ముఖ్యం తప్ప చెప్పిన అబద్ధాలే మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు. కర్నాట‌క రాజ‌కీయాల‌పైనా ముఖ్య‌మంత్రి స్పందించారు.

ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగానే అన్ని వ్య‌వ‌హారాలు జ‌ర‌గాల‌ని, కానీ క‌ర్నాట‌క‌లో అలా జ‌ర‌గ‌డం లేద‌ని బాబు విమ‌ర్శించారు. క‌ర్నాట‌క‌లో రెండు పార్టీలు క‌లిసి మెజార్టీ సీట్ల‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే… మెజార్టీలేని ఇత‌ర పార్టీకి అవ‌కాశం ఇచ్చార‌ని మండిప‌డ్డారు. ప్ర‌జాస్వామ‌య్య విలువ‌ల గురించి, కాంగ్రెస్ చేసిన అన్యాయం గురించి ఒక‌ప్పుడు మాట్లాడిన బీజేపీ ఇప్పుడు చేస్తోన్న ప‌నులేంటి అని చంద్ర‌బాబు నిల‌దీశారు. 1984లో కాంగ్రెస్ అప్ర‌జాస్వామికంగా ఎన్టీఆర్ ను తొల‌గిస్తే 30 రోజులు పోరాడి మ‌ళ్లీ ఆయ‌న్ను సీఎం చేసిన ఘ‌న‌త తెలుగుప్ర‌జ‌ల‌ద‌ని చంద్ర‌బాబు గుర్తుచేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామ‌న్న భావ‌న‌తో క‌ర్నాట‌క‌లోగానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గానీ, మ‌రే ఇత‌ర రాష్ట్రంలో గానీ ఇష్టానుసారంగా ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌ని చంద్ర‌బాబు హిత‌వుప‌లికారు.