Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. కర్నూల్ జిల్లాలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో బాలల భద్రతే భారత భద్రత పేరుతో నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు. 40 ఏళ్లగా ఒకే అంశంపై పోరాడుతున్న వ్యక్తి కైలాశ్ సత్యార్థి అని ఆయన కొనియాడారు. పిల్లల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ఆ క్రమంలో 144 దేశాలు తిరిగారని… ఆయన లాంటి వారి అవసరం సమాజానికి చాలా ఉందని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోనే పిల్లలు సంతోషంగా ఉండే ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని సీఎం చెప్పారు.
ప్రపంచాన్ని జయించే శక్తి యువతకుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారని, పెట్టుబడులను రాబట్టుకోవడంతో పాటు బాలల పరిరక్షణకు కృషిచేయాలని సభలో ప్రసంగించిన కైలాశ్ సత్యార్థి చంద్రబాబును కోరారు. తాను భారత యాత్ర గురించి ట్విట్టర్ లో పోస్టు చేసినప్పుడు అందరికన్నా ముందుగా స్పందించింది చంద్రబాబేనని కైలాశ్ సత్యార్థి చెప్పారు. పిల్లలు సంతోషంగా ఉండటానికి అందరం కలిసి కృషిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. బాలలకు భద్రత కల్పించే దేశంగా భారత్ ను తీర్చిదిద్దాలన్నారు. చిన్నారుల సంక్షేమం కోసం నాలుగు దశాబ్దాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్న కైలాశ్ సత్యార్థి పిల్లలపై వేధింపులు, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా భారత యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన దేశంలోని 22 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.